Sabbath Truth

  సబ్బాతు లేక విశ్రాంతి దినము

విశ్రాంతి దినము లేక సబ్బాతు దేవుడు మనుష్యులకు బహుకరించిన ఒక గొప్ప వరం. అది తర తరముల నుండి శాశ్వత కాలముల వరకు దేవుడిని సృష్టి కర్తగా స్మరించి ఆరాధించడానికి ప్రతిష్టించబడిన గొప్ప సూచికా స్మరణం. ఆ  దినమంతా దైవ స్మరణము ద్వారా శారీరక విశ్రాంతి కలుగుతుంది, నూతనమైన ఆధ్యాత్మిక బలము వస్తుంది, అందమైన ఆరోగ్యం దొరుకుతుంది, అన్నింటికంటే ఎక్కువగా దేవుని మహిమ యొక్క దీవెనలు దొరుకుతాయి.

“దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.” – ఆదికాండము 2:2-3

విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.” – నిర్గమాకాండము 20:8,11

మొదటిగా మనుష్యులు విశ్రాంతి దినమును జ్ఞాపకముంచుకొనమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అనగా భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనుష్యులు విశ్రాంతి దినమును మరచిపోయే రోజులు వస్తాయని తెలిసి ముందే జ్ఞాపకముంచుకొనమని చెప్తున్నాడు.

రెండవదిగా మనము ఆచరిస్తున్న ఏడు రోజుల వార చక్రాలకు మూలం దేవుడే. దేవుడి సృష్టికి కలిగిన నిర్వచనమే ఏడు రోజుల వారము.

మూడవదిగా ఏడవ రోజు అంటే శనివారము. ఆది అంటే మొదటి అని అర్థము. ఆదివారము అనేది మొదటి రోజు. కాబట్టి శనివారమే బైబిలు ప్రకారము విశ్రాంతి దినము.

ఆదివారం మొదటిరోజు అనడానికి బైబిలు యొక్క ఆధారము

విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్ధలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.మత్తయి 28:1

పై లేఖనములో చూసినట్లయితే విశ్రాంతి దినము మరియు ఆదివారము అనే దినాలను ప్రత్యేకంగా చూస్తాము. ఈ మత్తయి సువార్త క్రీస్తు పునరుద్ధానము పిమ్మట సుమారు 39 సంవత్సరాల తరువాత రచించబడింది. అనగా క్రీ.శ.70 తరువాత రచించబడింది. అన్ని సంవత్సరాల తరువాత కూడా బైబిలు విశ్రాంతి దినమును మరియు ఆదివారమును వేరుగా పేర్కొనబడింది.

కాబట్టి బైబిలు ప్రకారము విశ్రాంతి దినము శనివారము.

విశ్రాంతి దినము ఎవరికి ఇవ్వబడింది ?

దేవుడి ఆజ్ఞలను చులకనగా చూసి నిర్లక్ష్యపెట్టి ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయన్ని ఘనహీన పరిచే వారు దేవుడి వాక్యానికి విరుద్ధముగా విశ్రాంతి దినము కేవలము యూదులకు మాత్రమే ఇవ్వబడింది అని తప్పుడు బోధలు చేస్తున్నారు.

“మరియు విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు.” మార్కు 2:27

పరిశుద్ధుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నోటి వాక్కు ఈ విశ్రాంతి దినము మనుష్యులకు నియమించబడింది అని చెప్తుందే కాని యూదులకు మాత్రమే అని చెప్పడము లేదు. కాని వీరు వారి యొక్క వాక్య విరుద్ధమైన అభిప్రాయాల ద్వారా దేవుడి వాక్యమును నిరర్థకము చేయాలనే తప్పుడు మార్గంలో ఉన్నారు.

ఎంత చెప్పినా కూడా వారు విశ్రాంతి దినము పాత నిబంధన అని లేక కేవలం యూదులకే అని చెప్తారు కాని దేవుడి వాక్యము ఏమి చెప్తుందో దానిని ప్రతిధ్వనిoచరు.

ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదై నను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.” – ద్వితియోపదేశకాండము 5:14

యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను” – యెషయా 56:3

పై లేఖనములు చూసినట్లయితే దేవుడు పరదేశులను మరియు అన్యులను విశ్రాంతి దినమును ఆచరించమని చెప్తున్నాడు. వారిని తన యొక్క పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వస్తానని చెప్తున్నాడు. బైబిలు చాలా సూటిగా దేవుడి రాజ్యములోనికి చేరడానికి పాత నిబంధనలోనే అన్యుడు సైతం విశ్రాంతి దినము పాటించాలని దేవుడు చెప్పాడు.

అలాగే కొత్త నిబంధన ప్రకారము అన్యులు వేరు యూదులు వేరు అని దేవుడు చెప్పలేదు. అందరు ఒకటే అని దేవుడు చెప్పాడు.

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” – రోమీయులకు 10:12

“మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.” కొలస్సీయులకు 3:10-11

లేఖనముల ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తును పోలి జీవించడమే నవీన స్వభావము. అయితే ఇందులో మీరు అన్యులని లేక యూదుదని తేడా లేదు. మనము యేసు క్రీస్తు జీవించిన పాప రహిత జీవితము జీవించాల్సిందే. యేసు క్రీస్తు విశ్రాంతి దినము పాటించాడు కాబట్టి మనము అనగా అన్యులని యూదులని తేడాలేకుండా ప్రకటన గ్రంధం 1:10 లో ప్రభువు దినంగా చెప్పిన  విశ్రాంతి దినము పాటించాల్సిందే. బైబిలులో ఏ లేఖనము విశ్రాంతి దినము ఆదివారము అని చెప్పలేదు. అలాగే లేఖనాలలో ఎక్కడా కూడా విశ్రాంతి దినము ఆదివారముగా మార్చబడడమును అధికారముగా ప్రకటించబడలేదు.

బైబిలులో లేఖనాలు ఒక్కాణిoచి మరి దేవుడు మారడు అని మరియు ఆయన పది ఆజ్ఞలు న్యాయ సింహాసపు పునాది మారనేరదు అని చెప్తున్నాయి. అలాగే ఈ లోకములోని వారి లేఖన జ్ఞానము లేని అజ్ఞానమును అవకాశంగా చేసుకొని బైబిలులో ప్రభువు దినము అని పిలువబడిన విశ్రాంతి దినమును ఆదివారము అని అబద్ద వివరణలు చెప్తున్నారు. అలాగే కొంతమంది వారి స్వకీయ దురాశల నులివెచ్చని స్థితిలో మత్తులైన వారు ఈ విశ్రాంతి దినము ఆదివారము అని అపవిత్రాత్మలచేత ప్రేరేపింప పడి వారికి కలిగిన కప్పల లాంటి నాలుకల ద్వారా అబద్ధాలను ప్రకటిస్తున్నారు.

బైబిలు మాత్రము పూర్తిగా స్పష్టంగా పాత నిబంధనలో కాని కొత్త నిబంధనలో కాని యూదులకు గాని అన్యులకు గాని అందరికి కూడా ఒకడే దేవుడైన వాడు పక్షపాతము లేకుండా అందరకి ఒక్కటే నైతిక ఆజ్ఞలను ఇచ్చాడు  అలాగే ఒక్కటే విశ్రాంతి దినమును నియమించాడు. ఒక్కసారి ఆలోచించoడి. ఒక్క పట్టణములో యూదులైన క్రైస్తవులు ఉన్నారు మరియు అన్యులైన క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు అదే పట్టణములో క్రైస్తవులు కాని యూదులు మరియు అన్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు యూదులైన క్రైస్తవులు యదా విధిగా శనివారమును విశ్రాంతి దినముగా పాటిస్తున్నారు. అయితే అన్యులైన క్రైస్తవులు ఆదివారమును లేక మరి ఇతర రోజును విశ్రాంతి దినముగా పాటిస్తున్నారు అనుకోండి. అయితే ఒక దేవుడిని ఒక్కడే ప్రభువైన క్రీస్తుని రెండు వేరు వేరు విధాలగా ఆరాధించవచ్చా? లేఖనాలు అందరు ఏకమై కూడుకొని ఆరాధించమని చెప్తే వీరు విభజించపడి ఒకరు శనివారమున మరి యొకరు ఆదివారమున ఆరాధించవచ్చా? అప్పుడు చూసే ప్రజలకు ఇది గందర గోళంగా కనిపించదా? ఏది నిజం అనే అనుమానం రాదా? ఖచ్చితంగా ఇలా విభజించే ఆరాధన సాతాను పనే కాని దేవుడి పని కాదు. మీరే ఆలోచించండి యూదులకు అన్యులకు మధ్య గోడ పడగొట్టి అన్యుల కొమ్మలు యూదుల ఒలీవ చెట్టుకు అంటు కట్టబడతాయి అని చెప్పాడు కాని అన్యుల చెట్టుకు యూదుల కొమ్మలు అంటు కట్టబడవు.

“ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టునుండి కోయబడి స్వభావవిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన యెడ స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయ ముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా?” – రోమీయులకు 11:24

“ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.” ఎఫెసీయులకు 2:14-16

విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి” ద్వేషముగా ఇశ్రాయేలీయులను అన్యులను వేరు పరచే ఆజ్ఞలు అంటే దేవుని ఆలయములో ఇశ్రాయేలీయులు అర్పించే బలులు, వారు తీర్చే మొక్కులు, పాపాలకు పరిహార్ధంగా అర్పించే బలులు, రాళ్ళతో కొట్టి చంపే శిక్షలు లాంటివి అన్ని కొట్టివేయబడి వారిద్దరు ఏకమయ్యారు అని బైబిలు చెప్తుంది.

పది ఆజ్ఞలు ద్వేషాన్ని చూపేవి కావు. నరహత్య చేయొద్దు అనడం ద్వేషం చూపడము కాదు. దొంగిలింప వద్దు అనడం ద్వేషం చూపడం కాదు, అబద్ద సాక్ష్యం పలుకవద్దు అనడం ద్వేషం చూపడం కాదు, అలాగే యెహోవా దేవుడిని మాత్రమే ఆరాధించడం ద్వేషము చూపడం కాదు, అలాగే మనుష్యులు సృష్టి కర్తను జ్ఞాపకము చేసుకొని విశ్రాంతి దినము పాటించడం ద్వేషం చూపడం కాదు అని బైబిలు చెప్తుంది.

ఉదాహరణకు ఈ వచనము చూడండి

యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను” – యెషయా 56:3

  పై వచనములో చాలా స్పష్టంగా అన్యులు విశ్రాంతి దినము పాటించాలని మరియు అలా పాటిస్తే వారు ఇశ్రాయేలీయులతో ఏకమై ఉంటారని బైబిలు చెప్తుంది.

కాబట్టి విశ్రాంతి దినము కొట్టి వేయబడలేదు అని దీని బట్టి మనకు అర్థమౌతుంది.

అయితే మీరు అనొచ్చు ఏ దినమైతే ఏ ముంది చేసేది ఒకే దేవుడినే కదా అని –

కాని ఒక భక్తి గల క్రైస్తవుడు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు తన సృష్టి కర్తత్వానికి గుర్తుగా నియమించి ప్రతిష్టించిన ఒక రోజును అంత తక్కువగా చూడడం అంటే తన సార్వభౌమత్యాన్ని తలలు వంచి సాగిల పడే అంగీకరించే మనము దేవుడి సృష్టికి పునాదిని ప్రశ్నించి మార్చాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది.

యెహోవానైను నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.” – మలాకి 3:6

దేవుడిని ప్రశ్నించే ముందు అసలు దేవుడికి విరుద్ధనమైన ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అని బుద్ధిగల దాసుడు ఆలోచిస్తాడు. దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అంటుంటే…ఆ అతిక్రమణకు దారి ఎలా తీసిందో తెలుసుకోవాలి. అంతేకాని ప్రాచీనత్వాన్ని ఆధారం చేసుకొని దేనిని నిజమని నిర్థారించకూడదు.

 

అపోస్తలుల కార్యములు 20:7 ఆదివార ఆరాధనను నిరూపిస్తుందా?

ఒక్కసారి ఆ లేఖనమును సందర్భానుగుణంగా అన్వయించి చదవాలి. అప్పుడు మనకు అసలు ఆ వచనము ఆదివారమున పౌలు ఆదివారం ఆరాధన జరిపాడో లేక ఆదివారం పని చేశాడో అర్థం అవుతుంది.

ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.” అపోస్తలుల కార్యములు 20:7

బైబిలు లేఖనాల నేపథ్యంలో ఒకరోజు  అనగా సూర్యాస్తమయము నుండి సూర్యాస్తమయము వరకు లెక్కించబడుతుంది. అలా చూసినట్లయితే వారు విశ్రాంతి దినము గడచిన తరువాత అనగా సూర్యాస్తమయము మొదలైన తరువాత ఆదివారము మొదలైనప్పుడు అనగా ఆదివారము మొదలైన తరువాత రాత్రి పూట రొట్టె విరవడానికి కూడుకొని అర్థరాత్రి వరకు మాట్లాడుతూ ఉన్నాడు అని భావం వస్తుంది.  ఈ కూడుక జరిగింది రాత్రి పూట అని ఇంత గట్టిగా చెప్పడానికి కారణం, వారు రొట్టె విరిచిన సమయం మరియు కూడుక సమయంలో ఉన్న పరిస్థుతులు.

మొదటిగా వారు కూడుకున్న ప్రదేశము ఎలా ఉందో చూద్దాము.

మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.” అపోస్తలుల కార్యములు 20:8

దీపములున్న మేడగాదిలో వారు కూడుకున్నారు అని బైబిలు చెప్తుంది. అనగా వారు కూడుకున్న సమయం పగలు కాదు రాత్రి వేళ అని స్పష్టంగా ఉంది. లేకపోతే అనేక దీపములు ఉండవు.

అది రాత్రి అని ఇంకా స్పష్టంగా అపోస్తలుల కార్యములు 20:9 కూడా ఋజువు పరుస్తుంది.

“అప్పుడు ఐతుకు అను నొక ¸యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను.” – అపోస్తలుల కార్యములు 20:9

వారు రొట్టె విరవడానికి కూడుకొనిన తరువాత పౌలు చాలా సేపు ప్రసంగిస్తున్నాడు. ఎంత సేపు అంటే అర్థ రాత్రి అయినంత వరకు రొట్టె విరువకుండా ఇంకా ప్రసంగిస్తూ ఉన్నాడు.

“అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.” – అపోస్తలుల కార్యములు 20:10-11

అటు తరువాత అతడిని స్వస్థ పరచి పైకి వెళ్లి రొట్టె విరిచాడు. అయితే మొదటి నుండి చదివితే ఇది అర్థ రాత్రి సమయం అని స్పష్టంగా అర్థమౌతుంది.

అలాగే అటు తరువాత తెల్ల వారు వరకు సంభాషించి బయలుదేరాడు అని లేఖనాలు చెప్తున్నాయి.

ఇలా లేఖనాలు పరిశీలించిన తరువాత వారు రొట్టె విరవడానికి రాత్రి వేల కూడుకున్నారు అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టే అర్థ రాత్రి వరకు విస్తరించి ప్రసంగిస్తూ ఉండగా ఐతుకు నిద్ర మత్తులో మూడవ అంతస్తునుండి పడిన తరువాత అతడిని స్వస్థ పరచి పైకి వచ్చి రొట్టె విరిచిన తరువాత కూడా తెల్ల వారు వరకు సంభాషించి అక్కడ నుండి బయలుదేరి ప్రయాణమైనట్లు లేఖనాల కథనం మనము చూస్తాము.

అయితే కొంతమంది అది ఆదివారం ఆరాధన అని అంటారు. అలా అయితే వారు విశ్రాంతి దినము గడచిన తరువాత రాత్రి నుండి ఎందుకు బైబిలు నేపథ్యములో రొట్టె విరవడానికి కూడుకొనడం లేదు? అలాగే ఎందుకు తెల్ల వారు జాము వరకు కూడకని కొనసాగిoచట్లేదు? ఎందుకంటే వారు లేఖనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టే. ఆదివారం అనే పధం బైబిలులో కనిపిస్తే చాలు ఆదివారం ఆరాధన అయిపోతుందా? లేక ఆదివారం అనే పధం బైబిలులో వాడడం తప్పా? మీరే లేఖనాలు పరిశీలించి గ్రహించాలి. అప్పుడే సత్యం అర్థమౌతుంది.

అయితే ఇంకొంతమంది ఆ కూటమి ఆదివారము ఉధయకాలమున మొదలయి మరసటి రోజు తెల్లవారు జాము వరకు జరిగిందని చెప్తారు.

అయితే వారు జ్ఞాపకముంచుకొనవలసినది వారు ఎందుకు కూడుకున్నారు అని?

లేఖనాలు వారు రొట్టె విరవడానికి కూడుకున్నారు అని చెప్తున్నాయి.

మరి రొట్టె ఎప్పుడు విరిచారు?

అర్థరాత్రి. ఐతుకును స్వస్థ పరచిన తరువాత విరిచాడు.

ఒకవేళ వారు కూడుకున్నది ఆదివారము ఉదయమే అయితే గనుక ఒక రొట్టె ఉదయం 6 గం నుండి 9 గం ల మధ్యలో చేసుకొని రోజంతా రొట్టె విరవడానికి కూడా విరామం లేకుండా అర్థరాత్రి వరకు ప్రసంగించి, ఆ అర్థరాత్రి వేళ ఎండిపోయిన రొట్టె విరిచి ఉండాలి. అది లేఖనాధారము కాదని స్పష్టంగా మనకు అర్థమౌతుంది.

అది రాత్రివేళ కూడిక అని, అందుకే ఆ మెడ గదిలో చాలా దీపాలు ఉన్నాయని మరియు రొట్టె విరిచింది అర్థరాత్రి అని చాలా అర్థవంతంగా లేఖనాలు తెలియపరుస్తున్నాయి.

అయితే ఇదంతా అయిపోయిన తరువాత అతడు బయలుదేరెను అని బైబిలు చెప్తుంది. అనగా విశ్రాంతి దినము గడవగానే ఆదివారము మొదలవడముతోనే రొట్టె విరవడానికి కూడుకొని, రాత్రి గడచి ఆదివారం ఉదయమున పౌలు బయదేరి ప్రయాణము చేసినట్లు లేఖనాలు చెప్తున్నాయి. అనగా వారు ఆదివారం ఆరాధన జరుపుకోలేదు కాని ఆదివారం నాడు ప్రయాణం చేశాడు. అంటే పౌలు సమయంలో అసలు ఆదివార ఆరాధనే లేదు.

అంతే కాదు పౌలు సహవాసులు లూకా మరియు ఇతరులు ఆ ఆదివారం ఉదయమున డబ్బులు చెల్లించి ఓడలో ప్రయాణించడం మనము చూస్తాము.

మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితివిు. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియ మించియుండెను.” – అపోస్తలుల కార్యములు 20:13

కాబట్టి ఎలా చూసినా కూడా ఆదివార ఆరాధన లేఖన వ్యతిరేకమే కాని లేఖనాధారము కాదు.