ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదా?
ప్రియులారా ప్రభువు నందు వందనములు! తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసముయు మీకు తోడై ఉండునుగాక!
ఇప్పటి దినములలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము గురించి చేస్తున్న అనేకమైన వాగ్వివాదాలు చూస్తున్నాము. ఒకరు ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని భోధిస్తున్నారు. ఒకరు కొట్టివేయబడలేదని బోధిస్తున్నారు. ఏది నిజం?
అది తెలుసుకొనే ముందు బైబిలు చదివే ప్రతి వారు రెండు పునాదులులాంటి విషయాలను జ్ఞాపకము ఉంచుకోవాలి.
- మొట్టమొదటిగా బైబిలు తన బోధలను తానే వ్యతిరేకించదు.
- రెండవదిగా కేవలం ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని బోధను రూపొందిచడం చేయకూడదు. ఎందుకంటే ద్వితియోపదేసకాండము 19:15 “….ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.” మత్తయి 18:16 ” అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడు నట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.” 2కొరింథీయులు 13:1 “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచ బడవలెను.” అని బైబిలు బోధిస్తుంది.
బైబిలు బోధలు ఈ రెండు స్తంబాలను ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాయి.
మన ఇష్టం వచ్చినట్లు ఒక వాక్యాన్ని చూపించి మన ఉద్దేశాలను, దుష్క్రియలను సమర్ధించుకోవడానికి ఉపయోగించుకొనకూడదు. అది మన నాశానమునకే దారి తీస్తుంది. వాక్యం అర్థం కాకపోతే ప్రార్థించి దాని భావాన్ని తెలుసుకోవాలి. అంతేకాని ఆ వాక్యమును దుర్బోధలకు ఉపయోగించి వాక్యాన్ని తప్పుదారి బట్టించకూడదు. జాగ్రత్త సుమీ! ఇది చాలా ప్రమాదకరం. సాక్షాత్తు దేవునితో చెలగాటం ఆడుతున్నట్లే.
ఇప్పుడు ధర్మశాస్త్ర బోధలను గురించి బైబిలు ఏమని బోధిస్తుందో చూద్దాము.
ముందుగా పాతనిబంధన మరియు కొత్త నిబంధన బోధలు రెండు కలిగి యున్న కీర్తనల గ్రంధం చూద్దాము.
కీర్తనలు 119:142 “నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.”
కీర్తనలు 1:2 “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.”
మరి యేసు క్రీస్తు తన గురించి సాక్ష్యం కోసం ఎక్కడ పరిశీలించమన్నాడో చూద్దాము.
యోహాను 5:39 “లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.”
మరి యేసు క్రీస్తు ప్రభువు వారు ఏ లేఖనములను గురించి మాట్లాడుతున్నారు?
ఖచ్చితంగా పాత నిబంధన గ్రంధంలో ఉన్న లేఖనాల గురించే మాట్లాడుతున్నారు ఎందుకంటే కొత్త నిబంధన గ్రంధం ఆయన ఆరోహణమైన తరువాత రాయబడింది.
మరి ఆ లేఖనాలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయో ఆయన మాటల్లోనే విందాము,
యోహాను 14:6 “యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”
పైన మనము ధర్మశాస్త్రము కేవలము సత్యమని చూసాము. మరి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రమును వ్రాసిన దేవుడే నేనే సత్యము అని ప్రకటిస్తున్నాడు.
ఎందుకు యేసుక్రీస్తు అలా ప్రకటించారు?
మత్తయి 5:17 “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.”
ధర్మశాత్రము సత్యము అని చెప్పిన ఆయన అది నేరవేరిస్తేనే సత్యము అవుతాడు. అది నెరవేర్చకపోతే అబద్ధికుడవుతాడు. ఆయన అప్పుడు నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయన సత్యం అయ్యాడు. ఎందుకంటే ధర్మశాస్త్రమును అతిక్రమించు వారు పాపులు అవుతారు. 1 యోహాను 3:4 “పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.”
మరి యేసు క్రీస్తు గురించి శిష్యులు ఏమని సాక్ష్యమిస్తున్నారో చూద్దాము.
1 యోహాను 3:5 “ పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.”
1 పేతురు 2:21-22 “ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.”
పై వచనములలో మనము చూసినట్లయితే ఆయన యందు పాపము లేకపోవడమే కాదు, ఆయన అడుగు జాడలలో నడుచుటకు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. అంతే కాని మన ఇష్టం వచ్చినట్లు నడవమని చెప్పలేదు లేక ఏదో సంఘ కాపరిని చూసో, సంఘ పెద్దని చూసో నడవమని చెప్పలేదు. కేవలం క్రీస్తుని చూసి మాత్రమే నడవవలెను. కేవలం యేసు క్రీస్తు మాత్రమే మన జీవితాలకు ఆదర్శం అయి ఉండాలి.
2 కొరింథీయులు 5:21 “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.”
పాపము ఎరుగని ఆయన పాపముగా చేయబడింది కేవలo నీ నా మనందరి పాపాల కొరకు. మరి ఈ రోజున మనము చూసినట్లయితే చాలా మంది ఆయన పాపము చేశారని మరియు ధర్మశాస్త్రమును అతిక్రమించారని భోధిస్తున్నారు. మీరు అనొచ్చు యేసు క్రీస్తు ధర్మశాస్త్రము ఎక్కడ అతిక్రమించారని?
కాని ఈ రోజున చాలా మంది భోధకుల ప్రకారము ఆయన విశ్రాంతి దినమును పాటించలేదని మరియు ఆ విషయమును ఆయన విశ్రాంతి దినమును అతిక్రమించడం ద్వారా భోధించారని చెప్తున్నారు. అది నిజమా? మరి అలాగ అయితే ఆయన పాపము చేసినట్లే కదా? ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఆయనే పాటించనప్పుడు తన ప్రజలకు దానిని పాటించమని ఎలా చెప్తారు? అసలు ఆ విశ్రాంతి దిన ఆజ్ఞను ప్రజలకు ఇవ్వవలసిన అవసరం ఏమిటి? ఇదంతా ఆ బోధకులు ఆలోచించరు. అంటే దేవుడు మనుష్యులు పాటించలేని ఆజ్ఞలు ఇచ్చాడని వారి వాదన. కేవలం మనుష్యులే కాదు దేవుడే పాటించలేకపోయాడని వారి పరోక్షమైన సమాధానం.
మీరు అనొచ్చు ధర్మశాస్త్రము కొట్టివేయబడడానికి, విశ్రాంతి దినము పాటించడానికి సంబంధం ఏమిటి అని?
ఎందుకంటే చాలా మంది ఆ విశ్రాంతి దినమును పాటించలేకే ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని బోధిస్తున్నారు. యేసు క్రీస్తు విశ్రాంతి దినము పాటించలేక ధర్మశాస్త్రమును అతిక్రమించాడని బోధిస్తున్నారు. కాని అది అబద్ధం. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువునందు ఏ పాపము లేదని, ఏ పాపము ఎరుగడని బైబిలు బోధిస్తుంది. మరి ఇలాగ ఈ దుర్భోధకులు బైబిలుకు బైబిలు వ్యతిరేకముగా ఉందని భోధిస్తున్నారు. ఎందుకంటే వారికి బైబిలు ఎలా చదవాలో తెలియదు.
బైబిలు ఎలా చదవాలో ఈ లేఖనముల ద్వారా మనము చూద్దాము.
యెషయా 28:13 “ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును.”
కాబట్టే యేసు క్రీస్తుని గూర్చిన ప్రవచనాలు కొంచెం ఇచ్చట మరియు కొంచెం అచ్చట ఉన్నాయి. అన్ని ఒక చోట లెవ్వు.
అవన్నీ పొందిక పరచుకోవడం దేవుని ఆత్మ చేత నడిపింపబడే వారికే అర్థమౌతుంది. అది చిన్న పిల్లలకైనా, బహు అనుభవాలు ఉన్న వృద్దులకైనా కేవలం దేవుని ఆత్మతో నడిపింపబడే వారికే అర్థమౌతుంది.
మరియొక అంశానికొస్తే ధర్మశాస్త్రము పాత నిబంధనకు సంబందించిందా లేక కొత్త నిబంధనకు సంబందించిందా?
చాలా మంది అది పాత నిబంధన అని, కొత్త నిబంధనలో ధర్మ శాస్త్రము అవసరము లేదని బోధలు చేస్తున్నారు. అది వాక్య సంబంధమైన బోధ ఏనా?
మనము అనేక మారులు కీర్తనలలో దేవుని వాక్యము గురించి చదువుతూ ఉంటాము.
కీర్తనలు 19:7-10 “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.”
కీర్తనలు 119:103 “ నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.”
కీర్తనలు 119:105 “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”
ఈ మాటలు కీర్తనాకారులు రచించినప్పుడు బైబిలు గ్రంధంలో 66 పుస్తకాలు లెవ్వు. కేవలము కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ వాక్యాలు కీర్తనా కారుడు ఏ ఆజ్ఞలను గూర్చి ప్రస్తావించాడు? కేవలం ధర్మశాస్త్రములో బోధించబడిన పరిశుద్ధతను చూసే వ్రాసారు.
మరి ధర్మశాస్త్రములో కీర్తనా కారులకు అంత ప్రీతికరమైన ఆజ్ఞలు లేక వాక్యాలు ఏవి?
బలులా? కాదు. నీతిని, నైతిక విలువలను బోధించే ఆజ్ఞలు.
దేవుడు బలులను కోరుకుంటున్నాడా?
1 సమూయేలు 15:22 “ అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.”
హోషియా 6:6 “నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.”
ఆమోసు 5:21-24 “ మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచు చున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దహనబలులను నైవేద్య ములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి.”
కీర్తనలు 51:16-17 “నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.”
కీర్తనలు 40:6-8 “బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.”
చాలా మంది ధర్మశాస్త్రము శరీర సంబంధమైనదని బోధిస్తారు. కాని కీర్తనలు 40:8 లో ధర్మశాస్త్రము ఆంతర్యములో ఉన్నదని చెప్పబడింది.మరియు పై వచనములలో ధర్మశాస్త్రము గురించి మాట్లాడినప్పుడల్లా బలులు ఆయనకీ ఇష్టమైనవి కాదని కేవలము కనికరము, న్యాయము, నీతిని, విరిగి నలిగిన మనస్సు కోరుకుంటున్నాడని చెప్పబడ్డాయి. కాని చాలా మంది ఈ దినములలో చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ మరియు సత్యమైన ధర్మశాస్త్రము మీద వారి ఉగ్రత, వెక్కసు వెళ్ళగ్రక్కటం చూస్తున్నాము. ఎందుకో తెలుసా? ఆ ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను చూస్తే వారి జీవితాల్లో లేని నీతి, న్యాయము, కనికరము లాంటివి చేయమని చెప్తాయి. వారు జనములను అబద్ద బోధలతో మోసం చేయడం కుదరదు. అందుకే ధర్మశాస్త్రము సత్యము అయిన ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇటువంటి వారి గురించి అపోస్తలుడైన పేతురు ముందే చెప్పాడు.
2 పేతురు 3:15-16 “ మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.”
కాబట్టి చాలా మంది ఆనాటి రబ్బీలులాగా వారి పట్టాలు చూపించి లేఖనాలను అపార్ధము చేసి జనులను తప్పు దారిలో నడిపిస్తున్నారు.
అసలు ధర్మశాస్త్రము మరియు కొత్త నిబంధన గురించి దేవుడు లేఖనాలలో ఏమని చెప్తున్నాడో చూద్దాము.
యిర్మియా 31:31-33 “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.”
ఇదే కొత్త నిబంధన, అక్కడ ధర్మ విధి అని వ్రాయబడిన పదము ధర్మ శాస్త్రములో ఉన్న పది ఆజ్ఞలను సూచిస్తున్నాయి. అదే అనాది కాలము నుండి వస్తున్న దేవుని ధర్మశాస్త్ర్హము.దాని నెరవేర్పును మనము చూద్దాము.
హేబ్రీయులకు 8:8-11 “అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను. ఇదిగో యొక కాలము వచ్చు చున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును¸ అది నేను ఐగుప్తుదేశములోనుండివీరి పితరులను వెలుపలికి రప్పించుటకైవారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు.ఏమనగావారు నా నిబంధనలో నిలవలేదు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడు నై యుందును వారు నాకు ప్రజలై యుందురు. ”
ఇక్కడ ధర్మ విధికి ఉపయోగించిన పదము, towrah. ఇదే పదము ధర్మశాస్త్రముగా తర్జుమా చేయబడింది. కాబట్టి కొత్త నిబంధనకి ధర్మ శాస్త్రమునకు సంబంధం ఉంది.
మరి పౌలుగారు ధర్మశాస్త్రమును గురించి ఏమని చెప్తున్నారో చూద్దాము.
రోమీయులకు 7:14 “ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను.”
రోమీయులకు 7:12 “కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునై యున్నది.”
బైబిలు గ్రంధం మొత్తం, పాత నిబంధన మరియు కొత్త నిబంధన రెండు ధర్మశాస్త్రము దేవుని నీతిని పరిశుద్ధతను బయలుపరుస్తున్నట్లు మనము చూస్తాము. మరి ఇప్పటి బోధకులు ఎందుకు ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని భోధిస్తున్నారు?
ఎందుకంటే వారు యెషయా 4:1లో చెప్పినట్లు కేవలం యేసు క్రీస్తు నామమును వారి సిగ్గును కప్పివేయడానికి ఉపయోగించుకుంటున్నారే కాని వారికి ప్రేమ లేదు. వారు ఇంకా పాపానికి దాసులే. వారు నీతిని అనుసరించలేక ఆ పాపానికి దాస్యంలో ఉన్నారని మరియు ఆ పాపమును జయింలేకపోతున్నారనియు ధర్మశాస్త్రము మీద వారు చూపిస్తున్న ద్వేషం ద్వారా వ్యక్తపరుస్తున్నారు.
రోమీయులకు 6:19-20 “మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.”
కాబట్టి ఇంకా పాపము చేసేవారే లేక పాపమును జయించలేనివారే ధర్మ విధులనుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు.
మరి ఇప్పటి బోధకులు ఏ వాక్యాలను ఆధారము చేసుకుని ధర్మశాస్త్రము కొట్టివేయబడినదని భోధిస్తున్నారు?
ఎఫెసీయులకు 2:14-16 “ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.”
ఇక్కడ మనము చూసినట్లయితే ద్వేషమును కొట్టివేశారు అని చెప్పబడింది. ఏమిటి ఆ ద్వేషము? విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రము అని చెప్పబడింది. ఇక్కడ ధర్మ శాస్త్రము మొత్తము కొట్టివేయబడలేదు కాని కేవలం విధి రూపకమైనవని చెప్పబడింది. ఇక్కడ విధి రూపకమైన అని ఉపయోగించిన గ్రీకు పదము డొగ్మ, అనగా ఒక తప్పుకు లేక పాపమునకు విధించే శిక్ష.. యేసు క్రీస్తు ప్రభువు వారు తన శరీరమందు అన్యులకు మరి యూదులకు రావలసిన శిక్షలను కొట్టివేశాడు. ధర్మ శాస్త్రములో విధింపబడిన మరణ శిక్షలను కొట్టివేసాడు. అంతే కాని ఆజ్ఞలను కాదు. అలాగైతే పది ఆజ్ఞల్లో ఒక్కటి అయిన విగ్రహారాధన కూడా కొట్టివేయబడాలి కదా? ఆ ఆజ్ఞయే కదా ఇశ్రాయేలీయులను అన్యులను వేరుగా చూపిస్తుంది.
ఇంకొక వాక్యము చూద్దాము.
కొలస్సీయులకు 2:14-16 “దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ”
ఇక్కడ చూసినట్లయితే మనమీద ఋణము, విరోధము అని చెప్పబడింది. 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞను మీకు విరోధమైనది? అన్నీయా లేక కొన్ని మాత్రమేనా? నరహత్య చేయవద్దు అనే దాంట్లో ఋణముకాని, విరోధము కాని కనిపిస్తుందా? లేదు. సరే కొట్టివేయబడిన ఆజ్ఞలను దేవుడు మళ్ళీ పాటించమని చెప్తాడా? చెప్పడు. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో నరహత్య, దొంగతనము, విగ్రహారాధన చేయవద్దని ఎందుకు బోధిస్తున్నారు? అవి కొట్టివేయబడ్డాయి కదా.ఒక చోట కొట్టివేయబడ్డాయని మరి ఇంకొక చోట పాటించమని ఎందుకు చెప్తాడు? ఇది కేవలము వాక్య భావములు తెలియని బోధకులు చేస్తున్న గందరగోళము.
మరి ద్వేషముగా చెప్పబడిన ధర్మశాస్త్రము ఏమిటి? అది ధర్మశాస్త్రములో ఎలా జతచేయ బడిందో ఒక్కసారి చూద్దాము.
గలతీయులకు 3:19 “ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను”
ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి ఆ సంతానమైన యేసు క్రీస్తు వచ్చు వరకు తాత్కాలిక పాప క్షమాపణ బలుల ద్వారా ఇవ్వబడింది. ఆయన నెరవేర్చి సమాప్తము చేసి కొట్టి వేసింది బలులను, ఆచారాలను బోధించే ధర్మశాస్త్రమునే గాని దేవుని పది ఆజ్ఞల ధర్మశాస్త్రమును కాదు. ఏ బలులనైతే ఆయన కోరలేదో, ఏవైతే మనకి వ్యతిరేకముగా ఉన్నాయో వాటిని ఆయన కొట్టివేశాడు. ఏవైతే మనకి తీర్పు తీస్తున్నాయో, మనకి శిక్ష విదిస్తున్నాయో వాటిని ఆయన కొట్టివేశాడు. అంతే కాని పాపము చేయవద్దు అని చెప్పిన ఆజ్ఞలను కాదు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని సూచించిన పది ఆజ్ఞలను కాదు.
ధర్మశాస్త్రము ముందే లేక పోతే ఏ ధర్మశాస్త్రమును ఆధారము చేసుకుని దేవుడు కయీనుకు శిక్షను విధించాడు? ఏ ధర్మశాస్త్రమును ఆధారము చేసుకొని నోవాహు దినములలో జల ప్రళయం రప్పించి భూమి మీద ఉన్న వారినందరిని శిక్షించాడు? ఏ ధర్మశాస్త్రమును ఆధారం చేసుకొని సోదొమ గోమొర్రాలను 10 మంది నీతి మంతులు కూడా లేని ప్రదేశముగా తీర్పు తీర్చి నాశనం చేశాడు?
కాబట్టే తాత్కాలిక పాప క్షమాపణకి దాని తరువాత శాశ్వత పాప పరిహారముగా వచ్చే యేసు క్రీస్తుని సూచిస్తూ ఆ బలులను ధర్మశాస్త్రములో వారి అతిక్రమముల నిమిత్తం ఇవ్వడం జరిగింది. అంతే కాని పది ఆజ్ఞలను కొట్టివేయడం జరగలేదు. ఆ ఆజ్ఞలు భూమ్యాకాశాలు సృష్టించబడినప్పటి నుండి ఉన్నాయి. అవి ఉన్నంతకాలము ఉంటాయి.
మత్తయి 5:18 “ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”
అంతే కాదు దాని తరువాత వచనములలో జరగబోయే దాని గురించి ఏమని చెప్పాడో చూడండి
మత్తయి 5:19 “కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.”
ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు పూర్వ కాలము గురించి మాట్లాడట్లేదు. భవిష్యత్ కాలము గురించి మాట్లాడుతున్నాడు.
ముందుగా ఈ ఆజ్ఞలు అని ప్రభువు పై వచనాల్లో ప్రస్తావించినవి ఏ ఆజ్ఞలు? మత్తయి 5:18లో చెప్పిన ఆజ్ఞలు గురించి చెప్తున్నాడు. అలాగే ఆ ఆజ్ఞలను బోధించువాడెవడో అని భవిష్యత్ కాలము గురించి చెప్తున్నాడు కాని ఇంతకు ముందు బోధించిన వారు అని చెప్పలేదు. కాబట్టి ధర్మ శాస్త్రములోని ఆజ్ఞలను అలా బోధించిన వారి గురించి ఇలా చెప్పిన ప్రభువు మరి ధర్మశాస్త్రము కొట్టి వేయబడిందని భోదిస్తున్న వారి సంగతి ఏమౌతుందో?
మత్తయి 7:12 “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.”
ఇక్కడ ధర్మశాస్త్రము గురించి ప్రభువు వారు ఏమి బోధించారు? ధర్మశాస్త్రము అంటే “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయమని” చెప్పి ప్రభువైన యేసు క్రీస్తు బోధించారు. అయినా కూడా ధర్మ శాస్త్రము కొట్టి వేయబడిందని చాలా మంది బోధిస్తున్నారు. అంటే మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయవద్దని వారు బోధిస్తున్నారు. ఎంత విషాదం? వారి తీర్పును వారే తీర్చుకుంటున్నారు.
అలాగే ఇంకొన్ని వచనాల తరువాత యేసు క్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్పారో చూద్దాము
మత్తయి 7:24 “కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.”
ఏ మాటలు అయితే ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు ఏమి చెప్పారో ఆ మాటలే ప్రభువు వారు చెప్పి వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుంటాడని చెప్పారు.
అందుకే మనము యేసు క్రీస్తు ప్రభువువారి సోదరుడైన యాకోబు పత్రికలో ఇలా చదువుతాము
యాకోబు 2:8-10 “మెట్టుకు నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును; వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్ర విషయములో నపరాధి వైతివి.”
పైన చూస్తే యాకోబు ధర్మశాత్రము పాటించడంలో ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన కూడా పాపము చేసినట్లే అని చెప్తున్నాడు. అంతే కాదు పక్షపాతము చూపడము ధర్మశాస్త్ర ఆజ్ఞ అతిక్రమమని కచ్చితంగా చెప్తున్నాడు.
మరి యాకోబు చెప్పిన నీ పొరుగువాని ప్రేమించమను ఆజ్ఞ ఎక్కడ ఉంది?
లేవికాండము 19:18 “….నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.”
మరియు యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పిన రెండు గొప్ప ఆజ్ఞలలో ఇది రెండవది.
మరి మొదటిది ఎక్కడ ఉంది?
ద్వితియోపదేశకాండము 6:5 “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.”
ఈ రెండు ఆజ్ఞలే.
ఒక్కసారి అస్సలు యేసు క్రీస్తుకి మరియు ధర్మశాస్త్రోపదేశాకుడికి మధ్య సంభాషణ చూద్దాము.
మత్తయి 22:35-36 “వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.”
ఇక్కడ దేనిలోని ఆజ్ఞలు ముఖ్యమైనవని ధర్మశాస్త్రో పదేశకుడు అడిగెను?
ధర్మశాస్త్రములోని ముఖ్యమైన ఆజ్ఞలు..
దానికి సమాధానం
మత్తయి 22:37-39 “అందు కాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.”
ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు వారు ఇప్పటి దుర్భోధకులు బోధిస్తునట్లు ధర్మ శాస్త్రము కొట్టివేయబడింది అని చెప్పలేదు. ధర్మశాస్త్రములోని ముఖ్యమైన కష్టమైనా ఆజ్ఞలను బోధిస్తున్నారు. కాని ఇప్పటి బోధకులు ఆయన మాటలను వక్రీకరించి అపోస్తలుడైన పౌలు పత్రికలలోని భావములు అర్ధము కాక దేవుని ధర్మ శాస్త్రము కొట్టివేయబడిందని మరియు వాటికి బదులుగా కేవలం రెండు ఆజ్ఞలే ఇవ్వబడ్డాయని బోధిస్తున్నారు.
ఎవరైతే ఈ బోధలు చేస్తున్నారో వారు కేవలము పది ఆజ్ఞల ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని చెప్పడమే కాదు, యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్పిన ఈ రెండు ఆజ్ఞలను కూడా వాటితోపాటు కొట్టివేయబడ్డాయని ఒప్పుకుంటున్నారు. కాబట్టి వారు ఏ ఆజ్ఞలు పాటించాల్సిన అవసరము లేదని పరోక్షంగా బోధిస్తున్నారు. ఇలా వారిని వారే నరకానికి పాత్రులుగా తీర్పు తీర్చుకుంటున్నారు.
అంతే కాదు దేవుని యొక్క పది ఆజ్ఞల ధర్మశాస్త్రము మన హృదయముల మీద రాయబడిందని బైబిలులో చెప్పబడింది. అంతే కాదు ఈ ధర్మ శాస్త్రము నెరవేర్చడము మన వలన కాదని బోధించేవారు యేసు క్రీస్తు ఆ పది ఆజ్ఞలు పాటించే శక్తిని తన విశ్వాసులకు ఇవ్వలేని బలహీనునిగా పోలుస్తున్నారు. ఎందుకంటే ఆజ్ఞలు పాటించడం కేవలం దేవుని ఆత్మ చేత ముద్రింప బడిన వారి వలన మాత్రమే అవుతుంది.
చివరిగా దేవుని రాకడ సమయము ఎలా చెప్పబడిందో చూడండి. జనములు దేవుని ధర్మ శాస్త్రానికి వారి అవిధేయత చేతనే గాక ఆయనకు విధేయతగా పది ఆజ్ఞల ధర్మశాస్త్రమును పాటిస్తున్న వారిని హింసించడం ద్వారా దేవుని ఎదుట దుష్టులుగా ఉన్న సమయం వస్తుంది.
ప్రకటన గ్రంధము 11:18 “జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.”
ఆ తరువాత ఏమైనదో చూడండి
ప్రకటన గ్రంధము 11:19 “మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవ బడగా దేవుని నిబంధనమందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.”
ఇది బైబిలు యొక్క 66వ పుస్తకమైన చిట్ట చివరి గ్రంధము. ఇక్కడ పరలోకంలో దేవుని ఆలయం తెరువబడి అక్కడ ఉన్న నిబంధన మందసం చూపించడం జరిగింది.
నిబంధన మందసములో ఏమున్నాయి?
పది ఆజ్ఞలు ఉన్నాయి. ఇది మనకు ఎలా తెలుస్తుంది?
హేబ్రీయులకు 8:1-5 “మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా. మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింప బడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము. ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్న యెడల యాజకుడై యుండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.”
చివరికి పరలోకమందున్న గుడారమును పోలె భూమి మీద మోషే గుడారము అమర్చబడిందని చెప్పబడింది. ఇదే మనము హేబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయములో కూడా చదువుతాము.
కాబట్టి ఆయన పది ఆజ్ఞలను పాటించి ఆయనికి విధేయత చూపించే వారిని నిరూపిస్తూ వారిని దూషించి, శపించి, నిందించి, హేళన చేసి, హింసించి చంపిన వారి కన్నులు తనివి తీరా చూసేలా దేవుడు ఆయన మందస పెట్టెలో ఉన్న పది ఆజ్ఞలను చూపిస్తాడు.
వీటికి అంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఈ ఆజ్ఞలు మార్చబడతాయి అని ముందే జాగ్రత్తగా ఉండమని దానియేలు గ్రంధములో హెచ్చరించాడు.
దానియేలు 7:25 “ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహో న్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాల ములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును”
ఇలా చేసింది రోమా సామ్రాజ్యం మరియు అలా మార్చింది రోమన్ కాతోలిక్ సంఘము.
పది ఆజ్ఞల్లో విగ్రహారాధ ఆజ్ఞను తీసివేసారు. అంతే గాక 4వ ఆజ్ఞ అయినటివంటి విశ్రాంతి దిన ఆజ్ఞను మూడవ ఆజ్ఞగా వారు మార్చారు. బైబిలులో 10వ ఆజ్ఞగా ఉన్నటివంటి దానిని 9 మరియు 10 ఆజ్ఞలుగా విభజించారు. ఇంత భయకరమైన క్రైస్తవ ద్వేషి మరియు క్రైస్తవ హింసాత్మకరాలు కాతోలిక్ సంఘము.
కాబట్టి చివరిగా ధర్మశాస్త్రములోని అన్ని ఆజ్ఞలను కొట్టివేయడం జరగలేదు. కేవలం బలుల రూపకమైన ఆజ్ఞలను మరియు పాపులను రాళ్ళతో కొట్టి శిక్షించి చంపేయమని చెప్పిన ఆజ్ఞలు మాత్రమే కొట్టివేయబడ్డాయి. అంతే కాని ఇది చేస్తే పాపం అని చెప్పిన ఆజ్ఞలు కాదు.