Hindus Questions – Christian Answers

Hindu Questions – Christian Answers (హిందు ప్రశ్నలు – క్రైస్తవ సమాధానాలు)

 

దేవుడు పగ తీర్చుకుంటాడా? దేవుడిని ఆరాధించకపోతే పగ తీర్చుకుంటాడా? అసలు పగ తీర్చుకునేవాడు దేవుడు ఏంటి?

ప్రియ ప్రశస్తమైన సోదరా సోధరీమణులారా మీరు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలంటే లేదు పగ తీర్చుకొనడు.

కాని శిక్షిస్తాడు. ఆ శిక్షయే మరణము. దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి.

అవును మీరు చేసిన దైవ ద్రోహానికి శిక్షిస్తాడు. దేవుని యొక్క ఘనత మహిమ ప్రభావములు  యొక్క జ్ఞానమును గూర్చి మీరు అజ్ఞానులు కాబట్టే దేవుని స్వభావము అర్థము కాక ఇలా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. బైబిలు ప్రకారము సత్యము అయి ఉన్న ఆయన మాత్రమే దేవుడు. కాబట్టి ఆయనే విశ్వమును సృష్టించాడు. కాబట్టి ఆయననే ఈ సృష్టి ఆరాధించాలి. ప్రతి ఒక్కరు వారు వారు చేసిన శరీర క్రియలను బట్టి తీర్పు పొందుతారు. ఆ తీర్పులో వేయబడేదే శిక్ష లేక దండన.

ఒక సందర్భములో సత్ ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ప్రభువలకు ప్రభువైన యేసు క్రీస్తు, అలా చేయలేక పోతే నిత్య శిక్షను అనుభవిస్తారని చాలా స్పష్టంగా చెప్తున్నాడు.

మత్తయి 25: 44-46 “అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుట¸ చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.”

బైబిలు దేవుడే శిక్షించే దేవుడు. ఆ శిక్ష ఆయన చేసే తీర్పులో నిర్ణయించ బడుతుంది.

హేబ్రీయులకు వ్రాసిన పత్రిక 9:27 “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.”- 2 కోరింథీయులకు 5:10

“యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.” – కీర్తనలు 19:9

“ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. వారు తమ దురాశలచొప్పున నడుచుచు,లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు,సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును. ” యూదా 1:15

“మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తముమ వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి; దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.” – ప్రకటన గ్రంథము 16:4-7

“నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.

సత్‌ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.” – రోమీయులకు వ్రాసిన పత్రిక 2:5-8

“తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.” – యోహాను 5: 22,27

ఇది పగ తీర్చుకోవడము కాదు శిక్షించడము. దేవుడు తానే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చి మానవాళికి తన రక్షణ సువార్తను ప్రకటించి అందరు మారాలని సేవకులను రాయబారులుగా నియమించి వెళ్ళాడు. ఆ సత్య సువార్తకు లోబడక హృదయములకు క్రీస్తు నామమునకై అడ్డు గోడలు కట్టుకొని కఠిన పరచుకున్న వారికి శ్రమ శిక్ష తప్పదు. వారు ఇక్కడ ప్రకృతి విపత్తుల ద్వారా శ్రమలను అనుభవిస్తారు. అలాగే నరకాగ్నిలో కాల్చి వేయబడతారు.

అలాగైతే బైబిలులో చెప్పిన ఈ వాక్య భావము ఏంటి అని అడుగుతారేమో?

“ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.” – రోమీయులకు వ్రాసిన పత్రిక 12:19

సాధారణంగా ఈ సృష్టిలో ఏ మానవుడికి తన సాటి మానవుడికి హాని చేసే అధికారము లేదు. ఆ అధికారము దేవుడు దగ్గర నుండి వస్తే తప్ప శిక్షించే హక్కు ఎవరికిని లేదు.

అయితే క్రైస్తవులుగా మేము నిజమైన దేవుని రాయబారులుగా బయలుదేరి మా పని చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరితో కేవలం ప్రేమ ఓర్పు సహనములతోనే వ్యవహరించమని దేవుడు చెప్పాడు. కాబట్టి మేము క్రైస్తవులగా ఎవరికిని ఏ హాని తలపెట్టకూడదు. అయితే మేము చేస్తున్న పనికి అనేక మంది భక్తిహీనులు, దైవ ద్రోహులు, దైవ దూషకులు అడ్డు వచ్చి మమ్మల్ని ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, తిడుతూ, కొడుతూ, చంపుతూ ఉన్నారు కాబట్టి, వారికి అధికారం లేకపోయినా మమ్మల్ని హింసిస్తున్నారు కాబట్టి వారికి రావలసిన శిక్ష దేవుడు తానే వేస్తానని చెప్తున్నాడు. ఆ దుష్టులు మీకు చేసిన కీడుని నేనే తిరిగి వారి మీదకి రప్పించి శిక్షిస్తాను, అలాగే ఆ పగ ఆ ప్రతీకారము నేను తీర్చుకుంటాను  అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు ద్వేషించి దూషిస్తుంది మిమ్మల్ని కాదుగాని మిమ్మల్ని పంపించిన నన్ను అని చెప్తున్నాడు.

“మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.” యోహాను 15:17-19

మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.” – మత్తయి 10:22

నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” – మత్తయి 5:10-12

మీరు చేసిన దైవ ద్రోహాన్ని బట్టి దేవుడు మీకు విధించే శిక్షయే కాని అది దేవుడు మీ మీద పగ తీర్చుకోవడము కాదు. ఆ శిక్షే ఆత్మకు వేయబడే రెండవ మరణము.

మీ క్రైస్తవ దేవుడు మిమ్మల్ని క్రైస్తవ దేశములోనే పుట్టించవచ్చు కదా? మిమ్మల్ని క్రైస్తవ దేశములో ఎందుకు పుట్టించాడు? మీ పూర్వికులు అందరు కూడా హిందువులే కదా?

ప్రియమైన సోదరా సోధరీమణులారా మీ అందరికి యేసు క్రీస్తు నామమందు వందనములు. ఈ రోజున హైందవ కుటుంబాలలో నుండి యేసు క్రీస్తును నమ్ముకుని క్రైస్తవులైన వారికే గాని లేక ఈ భారత దేశములో నివసిస్తున్న క్రైస్తవులనే గాని మన హైందవ సోదరులు మీరు ఎందుకు భారత దేశములో పుట్టారు లేకపోతే మీరు ఇలా మతం మారాలనే మీ దేవుడు గనుక కోరుకున్నట్లు అయితే ఎందుకు మిమ్మల్ని హిందువులుగా పుట్టించారు, మీరు ఆ మతములోనే పుట్టి ఉండొచ్చుగా లేక ఆ క్రైస్తవ దేశాలలోనే పుట్టి ఉండొచ్చుగా? అని ప్రశ్నిస్తున్న వారికి సమాధానంగా నా దౌర్భాగ్యమైన పాపపు జీవితాన్ని క్రైస్తవునిగా అంటే క్రీస్తు అనుచరుడుగా మార్చిన బైబిలు నుండే సమాధానము చెప్తాను.

ముందుగా ఏ మనిషి ఎక్కడ పుట్టాలని నిర్ణయించాలనుకునే మనకి మరియు మనకు కలిగిన ఈ మిక్కిలి అంధకారమైన ఈ ఆలోచనను బట్టి మనకి మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి.

మీరు ఎప్పుడైన ఒక మనిషిని కాని ఒక జంతువుని కాని సృష్టించి వారిని జీవించే లాగా చేశారా? లేక చనిపోయిన వారికి తిరిగి జీవాన్ని ఇవ్వగలిగారా?

లేదు! మరి ఏ హక్కుతో లేక ఏ అర్హతతో మనము దేవుడిని ఒకళ్ళని ఇక్కడ పుట్టించాలని లేక అక్కడ పుట్టిచాలని అంటున్నాము?

అయితే బైబిలులో ఒక లేఖనము ఇలా చెప్తోంది..

యోబు 21:22 “ఎవడైనను దేవుడికి జ్ఞానము నేర్పునా?

ఆలోచించండి ఒక కుటుంబాన్ని కూడా ఏ ఇబ్బందులు సమస్యలు గొడవలు కష్టాలు పాపాలు లేకుండా పరిపూర్ణంగా నడపలేని మనము దేవుడికి సమస్త విశ్వాన్ని నడిపిస్తున్న దేవుడికి  ఇలా చెయ్యి లేక అలా చెయ్యి అని చెప్తామా?

సరే మీరు అడిగిన దానికి సమాధానం కూడా బైబిలులోనే ఉంది.

కీర్తనలు 24:1 “భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.

అన్నియు యెహోవావే అయినప్పుడు ఆయనకు ఇష్టం వచ్చిన చోట మనుష్యులని పుట్టిస్తాడు. ఆ చోట నుండి తన నామాన్ని లేక తన మహిమను అందరికి తెలియపరచుకుంటాడు. కాబట్టే పుట్టేన ప్రతి వారు ఆయన నిర్ణయించిన ప్రకారమే పుడుతున్నారు. కాబట్టి

యెషయా 44:24 “గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

కాబట్టే వీటిని గురించి లోతైన పరిశోధన చేసిన కీర్తనకారుడు ఇలా అంటున్నాడు.

కీర్తనలు 104:24 “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.”

కాబట్టి ఆయన ఎంత జ్ఞానము గల వాడంటే తన మహిమను తాను ఏర్పరచుకొనిన వారి ద్వారా భూమి మొత్తము నింపుతున్నాడు. అవి ఆయన ఆలోచనలు. అవే ఆయన యొక్క  జ్ఞానము గల కార్యములు.

అంతా ఆయనదే. ఆయన ఎవ్వరికి రుణ పడి లేడు. మనమే మనలని సృష్టించిన నిజమైన సృష్టికర్తను వదిలేసి ఎవడిని పడితే వాడిని దేవుడు దేవుడు అనుకుంటూ ఇప్పుడు ఇంత మంది దేవుళ్ళని చేసుకొని గాడమైన చీకటిలో బ్రతుకుతున్నాము.

యోబు 41:11 “నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా” అని దేవుడు అడుగుతున్నాడు.

ఆయనే అందరికి ఇచ్చేవాడు కాబట్టే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఒకసారి ఈ లేఖనము పరిశీలించండి

1 సమూయేలు 2:8 “దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తు వాడు ఆయనే…”

మనము ఆయన్ని ప్రశ్నించే ముందు ఆయనని తెలుసుకుని ప్రశ్నించాలి. మనము  సర్వజ్ఞానులం కాదు అనంతులము కాదు. కేవలము వాడిపోయి రాలిపోయే పువ్వు లాంటి శరీరము గలవారమని జ్ఞాపకము ఉంచుకొనే మాట్లాడాలి. మనము  ఒక్క గొప్ప కార్యము చేయగానే ఏదో ప్రపంచానిని లేక విశ్వానిని జయించినట్లు ఉప్పొంగి పోకూడదు. ఎంత ఎదిగితే అంత తగ్గించుకోవాలె గాని హేచ్చించుకో కూడదు. మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు కాబట్టే బైబిలులో మనలా దేవుడినే ప్రశ్నించే గర్వం ఉన్న వారి గురించి ఇలా రాయబడింది.

1 కోరింథీయులకు 1:27-29 “ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు  ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని  దేవుడు  ఏర్పరచుకొని యున్నాడు.”

అయితే చివరిగా మీరందరు జ్ఞానులని మీలో మీరు తలంచుకుంటూ జీవిస్తున్నారు కదా! మీకు ఒక ప్రశ్న

మరి మీ దేవుడే లేక దేవుళ్ళే నిజమైన దేవుళ్ళే అయితే ఎందుకు అందరిని భారత దేశములోనే పుట్టించ్చొచ్చుగా? మరి ఇతర దేశాలలో లేక ఇతర మతాలలో ఎందుకు పుట్టిస్తున్నాడు? మిగతా మతాల వారి అందరికి సంతానాన్ని ఆపెయోచ్చుగా?

ఏమి చేయలేని మనమైతే మాకు ఆయన దేవుడిగా అవసరము లేదు అని నిర్ణయించుకునే హక్కు అయితే కావాలా? కాని దేవుడు మాత్రం ఏ మనిషిని ఎక్కడ పుట్టించాలి అనే ఉపాయం మాత్రం మన దగ్గర తీసుకోవాలా?

అయితే మీ ప్రశ్నకు ముగింపుగా నేను చెప్పేది ఏమిటంటే దేవుడు తన జనులను ఈ మతము ఆ మతము అని కాకుండా ఈ ప్రదేశము ఆ ప్రదేశము అని కాకుండా అన్ని చోట్ల తన జనులను ఉంచి, అన్ని చోట్ల తన ప్రేమను అందరికి తెలియ పరుచుకుని తద్వారా అందరు రక్షించబడాలి, ఏ ఒక్కరు నశించ కూడదు అనే పుట్టిస్తున్నాడు.

2 పేతురు 3:9 “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”