నిత్య నరకాగ్ని గురించి సత్యము

నిత్య నరకం

బైబిలు ప్రకారం యేసు క్రీస్తును అంగీరించిన వారు పరలోకానికి వెళ్తారని క్రైస్తవులైన మనకి తెలుసు మరియు అంగీకరించని వారు నరకానికి వెళ్తారు అని కూడా తెలుసు. మరి ఈ జ్ఞానమును ఇచ్చే పరిశుద్ధ గ్రంథం అయిన బైబిలు లేఖనాలు ఏమి బోధిస్తున్నాయి?

అయితే ఇది ఎందుకు తెలుసు కోవాలంటే దేవుడు తన గ్రంథములో తన నిజమైన కన్యకా వధువు సంఘము ద్వారా  సత్యమును ప్రకటించి నట్లే సాతాను కూడా తన వేశ్య అయిన అబద్ద సంఘము ద్వారా అబద్ధములను ప్రకటిస్తున్నాడు. ఆ సత్య ద్వేషి అయినటివంటి సాతాను దేవుని సత్యమునకు అబద్ధములను జోడించి అనేక మందిని తనతో నరకంలోకి తీసుకెళ్ళాలనే కుతంత్రం కలిగిన వాడు. దేవుని పనిలో గురుగులు నాటి దేవుడు  ప్రేమించి సంపాదించుకున్న వారిని నాశనం చెయ్యాలనేది వాడి ఆరని తీవ్రమైన కోరిక.

కాబట్టి ఈ పవిత్ర యుద్ధంలో దేవుని లేఖనమైనటువంటి మరియు ఆత్మ ఖడ్గం అయినటువంటి దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాతానును జయించ గలము.

హేబ్రీయులకు వ్రాసిన పత్రిక 4:12 “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.”

మరి మనం ఆ వాక్య ఖడ్గమును ఎలా ఉపయోగించాలి?

1 తిమోతికి వ్రాసిన పత్రిక 4:1-2  “అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.”

కాబట్టి దెయ్యముల బోధలను ఎదుర్కొవడము కొరకు మనము ఎప్పుడు వాక్యమనే ఖడ్గమును ధరించుకొని ఉండాలి. మరి ఈ దేయ్యముల బోధలలో ఒకటైనటువంటి నిత్య నరకం గురించి దాని ఏర్పాటునకు కలిగిన ఉద్దేశ్యము మరియు దాని వెనకాల ఉండినటువంటి లక్ష్యం గురించి మనం తెలుసుకోవాలి.

అస్సలు నరకం ఎందుకు? దానిలోకి ఎవరు ఎందుకు వెళ్తారు? వెళ్ళిన వారు ఎంత కాలము ఉంటారు? వారు ఇంక శాశ్వతం అక్కడ జీవిస్తూనే ఉంటారా? వారు ఎప్పుడూ హాహాకారాలతో అరుస్తూ ఏడుస్తూ ఉంటారా? తక్కువ పాపం చేసిన వారైనా లేక ఎక్కువ పాపం చేసిన వారైనా ఒకే శిక్షను అనుభవిస్తారా? మంచి కోసం సమాజంలో పోరాడిన అవిశ్వాసులు కూడా ఆ నరకంలో సాతాను మరియు వాడి దూతలతో పాటు సాతాను అనుభవించే శిక్షను అనుభవిస్తూ  ఉంటారా?

వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే లేఖనములను క్షుణ్ణంగా పరిశీలించాలి. కేవలం ఒక్క వాక్యం మీద బోధలను ఏర్పాటు చేయకూడదు. కాబట్టి బైబిలులో ఉన్న 66 పుస్తకాలు ఏమి చెప్తున్నాయో మనము వెతకాలి.

నరకం ఎందు కొరకు సిద్ధ పరచబడింది?

మత్తయి 25:41 “అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.”

ఈ నిత్య నరకాగ్ని అపవాదికి లేక సాతానుకు వాడి దూతలకు సిద్ధ పరచ బడిందే కాని మనుష్యుల కొరకు కాదు. కాని వీరు మనుష్యులు అయి ఉండి దేవుడిని కాదని అపవాధిని వెంబడించారు గనుక వారు నరకాగ్ని లోకి త్రోయ బడతారు అని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా తిరుగు బాటు చేసిన సాతానుకు వాడి పాపములకు విధింపబడే శిక్ష నిత్యాగ్ని అని బైబిలు స్పష్టంగా చెప్తుంది. ఇలా ఇంతమంది మనుష్యుల నాశనానికి కారణమైన సాతాను శిక్షించబడాలనే దేవుడు నిత్యాగ్నిని ఏర్పాటు చేయడం జరిగింది.

ఎందుకంటే

ప్రకటన గ్రంథము 19:2 “ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి”

ఆయన నీతిమంతులకు కలిగిన క్షోభను మరియు వేదనలను అన్నింటిని లెక్కించి తీర్పు దినమున దానికి ప్రతి దండన చేసేవాడు. దాని అర్ధం ఆయన పగ తీర్చుకునే వాడు కాదు గాని చేసిన తప్పులకు శిక్ష విధించేవాడు. ఆయన వారు ఈ భూలోకంలో అధికులైన అధములైన ధనవంతులైన బీధలైన వారి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చే దేవుడు.

కాబట్టి ఈ నిత్యాగ్ని అపవాదికిని వాడి దూతలకు ఏర్పాటు చేయబడినది.

మత్తయి 10:28 “మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.”

అలాగే ఆ నరకం శరీరమును మాత్రమే కాదు శరీరముతో పాటు ఆత్మను కూడా నశింపచేయడానికి సిద్ధపరిచాడు. ఎందుకంటే మనకి సాతాను వాడి దూతలు ఆత్మ ప్రాణులని తెలుసు. మరి ఆత్మ ప్రాణులు కూడా నశించి పోతారు అని బైబిలు చెప్తుంది.

హేబ్రీయులకు 1:7 “తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు”

అదే కీర్తనలు 104:4లో కూడా మనము చూడొచ్చు.

ఇక్కడ వాయువులు అనగా ఆత్మలు అని అర్థం. కాబట్టి ఆత్మలై ఉన్న సాతానును మరియు పడి పోయిన దేవ దూతలను, అలాగే  వారితో పాటు ఆ నరకంలో మన దేహములను, ఆత్మలను నశింప చేయడానికే దేవుడు నరకమును సిద్ధపరిచాడు. కాబట్టి శరీరమును మామూలు అగ్ని నాశనము చేయగలదు కాని ఆత్మను నశింప చేయడానికి ప్రత్యేక మైన బహు శక్తి గల భయంకరమైన  అగ్ని కావాలి. దాని ప్రభావాన్ని ఆర్పలేని నరకాగ్నిగా లేక నిత్యాగ్నిగా  బైబిలులో చెప్పబడింది.

మరి ఆ నరకంలోకి ఎవరు వెళ్తారు? ఎందుకు వెళ్తారు?

మనము మత్తయి 25:41 లో చూసినట్లు ప్రప్రథమముగా సాతాను వాడి దూతలు చేసిన తిరుగుబాటును బట్టి వాళ్ళు నరకములో నాశనము చేయబడడానికి పంపబడతారు. వారితో పాటు ఇంకా బైబిలు లేఖనాల ఆధారంగా ఎవరు వెళ్తారు? అది కూడా లేఖనాలు పరిశీలిస్తే మనకి తెలుస్తుంది.

ముందుగా నిన్ను వలే నీ పోరుగువారిని ప్రేమించమని చెప్పిన దేవుడు నేరుగా ఏమని చెప్తున్నాడో చూద్దాము.

మత్తయి 5:22” నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

ఎవరైతే తన సహోదరుని ద్రోహి అని చెప్తారో వారు నరకాగ్నికి లోనగుతారు అని ప్రభువు చెప్పడం జరిగింది. అలాగా దేవుడు మన నోటి నుండి వచ్చే ప్రతి మాటను తీర్పు లోకి  తీసుకొని వచ్చినప్పుడు మనము సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

అందుకే తరువాతదిగా

మత్తయి 7:19 లో “మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.” అని చెప్పాడు. ఖచ్చితంగా మన ఫలములు మంచిగానే ఉండాలి. ఒక్క చెడు కూడా ఉండకూడదు. కాబట్టి కేవలం నేను యేసు క్రీస్తును విశ్వసించాను మరియు అనేకమైన అద్భుత కార్యములు చేశాను అనుకోవచ్చు కాని అవి మీకు పరలోకంలో పౌరసత్వాన్ని ఖరారు చెయ్యవు. కాబట్టి ఖచ్చితంగా యేసు  క్రీస్తు ప్రభువు జీవించినట్లు జీవించి ఆయనలో పరిశుద్ధ ఫలములను ఫలిస్తే కాని పరలోకానికి చేరరు.

మత్తయి 5:48 “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.” మనమందరం పరిపూర్ణముగానే ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యము. ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నాయని జ్ఞాపకముంచుకుని ఆలయంలో చేయాల్సిన క్రియలు చేస్తూ ఫలించాలి. అప్పుడే మనము పరలోక రాజ్యం చేరుతామని దైవ గ్రంథం చెప్తుంది.

తరువాతదిగా

మత్తయి 13:40 “గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.”

ఇక్కడ మనము చూసినట్లయితే ఆయన సంఘములో ఫలించని వారే కాదు అలాగ కాకుండా గురుగులుగా ఉండి దేవుని పని ముందుకు సాగకుండా ఆటంక పరిచేవారు, అలాగే గొర్రె చర్మము కప్పుకుని తోడేళ్ళ వలే దుర్నీతితో సంఘమును చెల్లా చెదురు చేసిన వారు ఎవరూ కూడా పరలోకానికి రారు. వారు కూడా నరకానికే పంపడతారు.

తరువాతదిగా

మత్తయి 18:7-9 “అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ కాగా నీ చెయ్యియైనను నీ పాద మైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.”

ఇప్పుడు చూసినట్లయితే శోధనల వలన పాపము చేసే వారు. కాగా ఖచ్చితంగా మనలను దేవుని త్రోవ నుండి బలవంతముగా కాని లేక వ్యామోహము చేత గాని  తప్పించి మన శరీర అవయవాలను రెచ్చగొట్టే శోధనలు వచ్చినప్పుడు సాతానా! వెనకకి పొమ్ము అనే అధికార మాట ద్వారా శోధనలను జయించాలి. అలా జయించక మీ శరీర అవయములకు లోబడినట్లైతే ఖచ్చితంగా నరకoలో శిక్షను అనుభవిస్తారు . కాబట్టి బైబిలు ప్రకారం అవిశ్వాసుల కంటే ముందుగా విశ్వాసులే ఆయన మాట వినకపోవడం ద్వారా నరకానికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది.

 మత్తయి 25:41-45 “అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటయైనను¸ చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపకారము చేయకపోతిమని  ఆయనను అడిగేదరు. అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.”

కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే వారు వారి పొరుగువారైన అల్పులకు ప్రేమించి చేయవలసిన కార్యములు చేయనందున నరకానికి పంపిస్తాడని ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్నాడు. ఇక్కడ మరియొక్క సారి చూసినట్లయితే దేవుని దూతైనటు వంటి సాతాను తన కర్తవ్యమైన  దేవుని సేవను అనగా మనుష్యులకు సహాయం చేయాల్సిన అతడు మనుష్యులకు సహాయం చేయకపోగా వారికి ద్రోహం చేసినందుకు వాడికి మరియు వాడి దూతలకు దేవుడు విధించిన శిక్ష నిత్యాగ్ని. ఆ నిత్యాగ్ని లోకే మనము కూడా అనగా అలాగా అవసరతలో ఉన్న అల్పులైన మన పొరుగువారికి సహాయం చేయకపోతే నరకానికే వెళ్తాము. కాబట్టే యేసు క్రీస్తు ప్రభువు పేరును ఉపయోగించు కొనినంత మాత్రాన పరలోకము ఖరారు కాదు. కాబట్టి యెషయా 4:1లో చెప్పినట్లు ఆయన నామమును కేవలము వారి సిగ్గు తీసివేసుకొనుటకు ఉపయోగించుకుని ఆయన మార్గములో నడవని వారు కూడా సాతానుకు ఏర్పరిచిన నరకములోకే వెళ్తారు.

తరువాతగా

మార్కు 9:45-48 “45 నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికి వేయుము; 46రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె, కుంటి వాడవై జీవములో ప్రవేశించుటమేలు. 47నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని తీసి పారవేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. 48నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.

పై వచనములలో చూసినట్లయితే 48వ వచనములో అగ్ని ఆరదు మరియు పురుగు చావదు అని చెప్పబడింది. కాని దాని భావము తరువాత చూద్దాము. ఇక్కడ మనం గమనించినట్లైతే ఈ లేఖనములలో కూడా తన యొక్క శరీర అవయముల శోధనల వలన  అభ్యంతరపడుతున్న వారి గురించి మాట్లాడుతున్నారు కాని అన్యుల గురించి మాట్లాడటం లేదు. వారి గురించి మాట్లాడుతూ అగ్ని ఆరదు మరియు పురుగు చావదు అని చెప్పబడింది.

లూకా 3:17 “ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.”

ఒక్కసారి మార్కు 9:48లో చెప్పబడిన లేఖనమును ఇక్కడి లేఖనముతో పోలిస్తే మీకే ఆరని అగ్ని అంటే ఏంటో అర్థమౌతుంది. లూకా 3:17లోని గోధుమ పొట్టు ఎలాగైతే ఆరని అగ్నితో కాల్చివేయడం జరుగుతుందో అలాగే పాపులు అందరు అనగా ముఖ్యముగా విశ్వాసులలో ఉండి అభ్యంతరపడి పాపానికి లోబడేవాళ్ళు కాల్చివేయబడతారు అని చెప్ప బడింది. మరి పొట్టు నిత్య నరకాన్ని అనుభవిస్తుందా? పొట్టు ఎల్లప్పుడూ కాలుతూనే ఉంటుందా? ఖచ్చితంగా బూడిదగా మారి పోతుంది. అలాగా మన శరీరము మరియు ఆత్మ రెండు బూడిదగా చేయబడతాయి. అవి బూడిద అయి ఇంకా ఎవ్వరు లేకుండా ఆర్పలేని అగ్నితో కాల్చి వేయబడతాయి.

అవును వారి అగ్ని ఆరదు. ఆ బాధ అనుభవిస్తున్న వారు ఉనికిలో ఉన్నంత కాలము ఆ అగ్ని ఆరదు. వారు అస్సలు  ఉనికిలో లేకుండా పూర్తిగా బూడిదగా చేయబడి నాశనం చేయబడే వరకు ఆ అగ్ని ఆరదు. వారును  వారిలోని  వారి చెడుతనము అనేది ఇంకా ఎప్పటికి లేకుండా పూర్తిగా కనుమరుగు అయ్యేంత వరకు ఆ అగ్ని ఆరదు.

ఈ అగ్ని ఆరదు పురుగు చావదు అనే పదాలు ఆ బాధను అనుభవించే వారి యొక్క తీవ్రమైన వేదనను హాహాకారాలను వివరించడానికి  ఉపయోగించిన వచనము. అనగా ఆ స్థితిలో ఉన్నవారికి ఇంకా ఎప్పటికి ఆ బాధ విడువకుండా ఉంటుంది. ఆ బాధ కేవలం వారు ఈ సృష్టి ఉనికిలో లేనప్పుడు మాత్రమే ఉండదు. కాని వారు ఉనికిలో ఉన్నంతవరకు ఆ బాధ ఉంటుంది. ఇలా ప్రభువైన యేసు క్రీస్తు వారి తీవ్ర వేదనను వివరించాడు. ఆ బాధను మనము అనుభవించ కూడదు అని ప్రేమతో ఈ పద జాలాలతో హెచ్చరిస్తున్నాడు. జరగబోయేది ముందే చెప్తున్నాడు.

యోహాను 15:6 “ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును.”

కాబట్టి ఎవరైనా విశ్వాసి అయి ఉంది ఎండి పోయినట్లైతే వారు అగ్నిలో ఎండిపోయిన తీగెల వలే కాలిపోతారు. ఆ ఎండిపోయిన తీగెలు నిత్యము తగల బడుతాయా? అవి బూడిదగా అయిపోతాయి మరియు అలాగే మనుష్యులు కూడా బూడిదగా చేయబడతారు.

మలాకి 4:3”నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగ ధ్రొక్కుదురని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”

కాబట్టి మనము ఇప్పుడు దాక చూసిన వచనములను బట్టి కేవలము అన్యులు మాత్రమే కాదు విశ్వాససులు కూడా పరిశుద్ధుడైన నిజమైన దేవుడిని పరిశుద్ధంగా ఆరాధించని వారు మరియు పరిపూర్ణుడు అయిన నిజమైన దేవుడిని పరిపూర్ణముగా ఆరాదించని వారందరు ఆరని నరకాగ్నిలో వేయబడతారు అని ప్రభువైన యేసు క్రీస్తు చెప్పారు.

మరి నరకాగ్నిలో వేయబడినవారంతా ఏమి అవుతారు అని బైబిలు చెప్తుంది?

ఈ నరకాగ్నిలో అవిశ్వాసుల దుష్ ప్రవర్తన గల  చిన్న పిల్లలు నుండి అవిదేయులైన కౄరమైన దుష్టత్వముతో నిండిన ముసలి వారి వరకు అందరు వేయబడతారు. దేవుడు పక్షపాఠము లేని వాడు అని బైబిలు చెప్తుంది. అలాగే ఆయన పలికిన మాట సజీవమైనది కాబట్టి అది ఆయన పలికిన దంటతని  నెరవేరుస్తుంది. కాబట్టి అది ఎవరైనా సరే ఆయన చెప్పినట్లు జీవించనివారందరు నరకాగ్నిలో వేయబడతారని గుర్తుంచుకోండి.

కీర్తనలు 37:9-11 “కీడు చేయువారు నిర్మూలమగుదురు యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”

ఒక్కసారి మత్తయి 5:5 చదివితే పై వచనము నూతన భూమిని గురించి మాట్లాతుందని అర్ధమౌతుంది.

మత్తయి 5:5 “సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించు కొందురు.

భక్తిహీనులు వెళ్లబోయే స్థలము నరకము. ఆ నరకముతో సహా ఎక్కడా కూడా భక్తి హీనుల స్థలము కనిపించదని ప్రవక్త చెప్తున్నాడు. అలాగే వారు ఏమౌతారో కూడా కీర్తనలు 37:20 లో చెప్పబడింది.

కీర్తనలు 37:20 “భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.

దేవుని విరోధి అయిన సాతానుతో సహా ఆత్మలు అన్ని పొగలాగా కనబడకుండా పోతాయని మరియు వారు సర్వ నాశనం అవుతారని బైబిలు చెప్తుంది. దేవుడు సర్వ శక్తిమంతుడు అని బైబిలు చెప్తుంది. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని బైబిలు చెప్తుంది. కాని ఈ రోజున చాలా మంది దేవుడు ఆత్మను నాశనం చేయలేడని అబద్ద బోధలు చేస్తున్నారు. వారికి దేవుని శక్తి  గురించి తెలియక అలా బోధిస్తున్నారు.

కాని లేఖనాలు మాత్రము వారు కనబడకుండా పొగ వలె నాశనం అవుతారు అని చెప్తున్నాయి.

కీర్తనలు 37:34 “34యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. 35భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి యుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లి యుండెను. 36అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను. 37నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు. 38భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము.”

పై వచనములలో చూసినట్లయితే వారు నిర్మూలము అయిపోతారని మరియు నశించి పోతారని చెప్పబడింది. వారు నరకాగ్నిలో మరల కనబడకుండా ఇంక ఎవరు వెదకిన కూడా కనబడకుండా పూర్తిగా పొగవలె నశించిపోతారని చెప్పబడింది.

కాబట్టే మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినట్లు

యెషయా 10:28 “మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.” ఆత్మను దేహమును రెండిటిని నాశనము చేసే సర్వ శక్తి గల దేవుడికి భయపడాలి.

పై వచనములన్ని ఒకసారి క్లుప్తంగా చూసినట్లయితే విశ్వాసులుగా ఉండి ఆయన మాటకు విధేయత చూపించని వారు, విశ్వాములో నుండి పడిపోయిన వారందరు, అవిశ్వాసులతో కూడా నరకాగ్నిలో వేయబడి వారు ఉనికిలో ఉన్నంత వరకు ఆరని అగ్ని చేత అంటే ఇంకా ఎప్పటికి ఆత్మ శరీరము రెండు కనిపించకుండా పూర్తిగా నరకాగ్నిలో రెండవ మరణములో నశించిపోతారు.

అందుకే ఇలా చెప్పబడింది.

ప్రకటన గ్రంథం 21:4 “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”

చాలా మంది చెప్తున్నట్లు నిత్య నరకం మరణం అయితే అది ఇంక ఉండదు అని బైబిలు చెప్తుంది. అలాగే నరకములో ఉండే దుఃఖము, ఏడ్పు మరియు వేదన వంటివి కూడా ఇంక ఉండవు అని బైబిలు చెప్తుంది.

కాబట్టే ఇలా చెప్పబడింది.

నహూము 1:9 “యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.

ఇలా మరణము మరియు మరణకరమైన బాధ అనేది ఇంక నూతన భూమి మరియు నూతన ఆకాశములో ఉండనే ఉండవు అని చాలా స్పష్టంగా బైబిలు చెప్తుంది.

మరణము గురించి ఇంకా లోతుగా తెలుసు కోవడానికి ఇక్కడ చదవండి.

మరి ఒక్కసారి ధనవంతుడు మరియు దరిద్రుడైన లాజరు గురించి ఇప్పటి దాకా నేర్చుకొనిన విషయాలు అన్ని మనస్సులో ఉంచుకొని పరిశీలిద్ధాము.

వారి యొక్క ఉపమానము దేనికి సూచనో అనేది మనము బైబిలు ద్వారా నేర్చుకుందాము.

లూకా 16 “19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. 20లాజరు అను ఒక రిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి 21అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. 23అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి 24తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను-నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. 25అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. 26అంతేకాక ఇక్కడనుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మాయొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను. 27అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. 28వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. 29అందుకు అబ్రాహాము వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా 30అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. 31అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను.

పై ఉపమానము చూసినట్లయితే అది కేవలము ఉపమానమే అని అర్థమౌతుంది. ఈ ఉపామానము యొక్క ముఖ్య ఉద్దేశ్యం రక్షింప బడని వారు మోషే మరియు ప్రవక్తల మాటలే వినలేదంటే ఒక్కడు వారు శిక్షింప బడే నరకాగ్ని నుండి లేచి వచ్చి చెప్పిన కూడా ఆ అవిశ్వాసులు విని దేవుడి ఆజ్ఞలు పాటించరు. ఎందుకంటే వారు దేవుని కంటె తమని తామే అంత ప్రేమించుకున్నారు.

అయితే ఒకసారి ఉపమానంలోకి వెళ్తే మరణము అంటే నిద్ర అని బైబిలు చెప్తుంది. అయితే ఆ మరణములో “వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు. చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు. (ప్రసంగి 9:6,10)”

ఇక్కడ చూసినట్లయితే వారు ప్రేమింపరు అని చెప్పబడింది. అలాగే వారికి తెలివి ఉండదు మరియు ఉపాయము ఉండదు అని చెప్పబడింది.

మరి ఏ సంకల్పము ఉండని స్థితిలో నుండి తన సహోదరులను ప్రేమించి, వారిని రక్షించాలనే ఉపాయము తెచ్చుకొని ఎలా భూమి మీద జరిగే వాటిలో పాలు పంచుకోవడానికి వెళ్తాడు?

అంటే బైబిలు లేఖనాలు అబద్ధం చెప్తున్నాయా? లేకపోతే మనము వాక్యమును తప్పుగా అర్థం చేస్కొంటున్నామా? ఆలోచించండి. బైబిలు సత్యమే బోధిస్తుంది. మనమే దెయ్యముల బోధలను దేవుని వాక్యమునకు జోడించి తప్పుగా అర్థం చేసుకొంటున్నాము. వారు సంకల్పించు కొనలేరు అని కీర్తనలు 146:4 వ వచనము చెప్తుంది.

అయితే పైన ధనవంతుడు పడుతున్న బాధ అంతా కూడా రెండవ మరణములో అంతము అవుతుందని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ నూతన భూమిలో నూతన ఆకాశములో బాధ ఉండదు, వేదన ఉండదు, అలాగే ఆ దుష్టులు ఇంకా వెతికినా కూడా కనిపించకుండా బొత్తిగా పొగవలె అయి వారి శరీరములు బూడిదగా అయిపోతాయి అని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే ఆ ధనవంతుడు తాను చేసిన పాపమును బట్టి బాధపడి చివరికి పూర్తిగా నాశనం అవుతాడు.

అంతేకాదు ఆ ధనవంతుడిని అలాగే ఈ భూమి మీద అందరిని పాపులుగా చేసిన సాతాను సైతం బూడిదగా అయిపోతాడని బైబిలు చెప్తుంది.

యేహెజ్కేలు 28:14-18 “అభిషేకము నొందిన కేరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగిoచెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.”  

ఆఖరికి సాతాను కూడా బూదిద అయిపోతాడు అని బైబిలు చెప్తుంది, కాని ఈ రోజున చాలా మంది క్రైస్తవులo అని చెప్పుకుంటూ దేయ్యముల బోధ మరియు అన్యుల బోధ అయిన బోధను చేస్తున్నారు. వారు ఆత్మకు చావు ఉండదు అని బోధిస్తున్నారు. వారు ఆరాధించే దేవుడు ఆత్మను నాశనము చేయలేని అసమర్థుడు అని ప్రకటించుకుంటున్నారు.

కాని బైబిలు దేవుడు సమర్థుడు. శూన్యంలో నుండి సృష్టిని చేసిన దేవుడు తిరిగి సృష్టిని శూన్యముగా చేయగల శక్తిమంతుడు. మరి నిత్యాగ్ని గురించి బైబిలు ఏమి చెప్తుందో చూద్దాము.

ఆరని అగ్ని

యిర్మియా 17:27 “అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూశాలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.

2 దినవృత్తాoతాలు 36:19 “అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చి వేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి.”

ఆరని అగ్నితో యెరూషలేమును కాల్చి వేస్తాను అని చెప్పాడు. మరి యెరూషలేము ఇంకా తగలబడుతుందా?

లేదు. దానికి ఇంధనం ఉన్నంత సేపు తగలబడి ఆరిపోయింది.

అలాగే వారు చేసిన పాపాల కొలతను బట్టి ప్రతి ఒక్కరు నరకంలో తగల బడతారు కాని అది ఇంక ఎప్పటికి ఆరదు అని కాదు.

యెషయా 52:13 “అతడు యెహోవా మందిరమును రాజునగరును యెరూషలేములోని గొప్పవారి యిండ్లనన్నిటిని కాల్చి వేసెను.

అలాగే సోదోమ గొమొర్రాలకు సంభవిoచినది చూద్దాము.

యూదా 1:7 “ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంత ముగా ఉంచబడెను.”

2 పేతురు 2:6 “మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలును పట్టణములను భస్మము చేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,”

కాబట్టి సొదొమ గొమొఱ్ఱాలు ఇంకా నిత్యాగ్నిలో ఉన్నాయా?

లేదు. భస్మము అయిపోయాయి.

అలాగే ప్రభువైన యేసు క్రీస్తు నిత్యాగ్ని యొక్క తీవ్రతను అలాగే దానిలో తగలబడే వారు ఉనికిలో ఉన్నంత వరకు వారు అనుభవించే భరించలేని భయంకరమైన  యాతనను వివరిస్తున్నారు కాని ఆ అగ్నికి అంతము లేదని కాదు. ఈ సృష్టిలో దేవుడు తప్ప మరి ఎవ్వరు ఆపలేరు అని చెప్తున్నాడు.

అంతేకాదు బైబిలు ప్రకారము ఏ శత్రువు చివరిగా నాశనము అవుతుంది?

1 కొరింథీయులకు 15:26 “కడపట నశింపజేయబడు శత్రువు మరణము.”

మరి ఆ మరణము చిట్ట చివరగా అంతమవుతుంది.

ప్రకటన గ్రంథము 20:14 “మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.”

“అగ్ని గుండము” అని తప్పుడు తర్జుమా చేసారు, కాని అక్కడ తర్జుమా చేయాల్సిన గ్రీకు పదము హౌటోస్ అనగా “ఇదే రెండవ మరణము” అని అర్థము. అంతే కాని అగ్ని గుండము రెండవ మరణము కాదు.

ఇవన్ని దృష్టి లో పెట్టుకొని బైబిలులో బోధించబడిన దేవుని గురించి విశ్లేషిస్తే ఆయన న్యాయవంతుడు, ప్రేమామయుడు, దయ గలిగిన వాడు, కనికరించేవాడు, కృప చూపే వాడు, దీర్ఘ శాంతము గల వాడు, నీతిమంతుడు అని అర్థం అవుతుంది, అలాగే ఆయన అసలు కౄరుడు కాదు అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.

అలాగే ఆయన అగ్ని గుండంలో మారు మనస్సు పొందని వారిని నాశనం చేయడము కూడా ఆయనకు ఇష్టమైన పని కాదు. అది ఆయనకు అన్యమైన కార్యము అని బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది.

యెషయా 28:21 “నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన(అన్యమైన) కార్యమును చేయుటకు అపూర్వమైన(అన్యమైన) తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును.”

పైన తర్జుమా చేయబడినవి రెండు కూడా తప్పు భావముతో తర్జుమా చేసారు, ఎందుకంటే ఆయనకు నాశనము చేయడము అన్యమైన కార్యమే గాని ఆశ్చర్య కార్యము కాదు. ఇక్కడ రెండు చోట్ల అన్యమైన అనే పదమును ఉపయోగించాలి. కాని పొరపాటునో లేక తర్జుమా చేసిన వాళ్ళు వారికి అర్థం కాకనో అలా చేసారు కాని అక్కడైతే అన్యమైన కార్యము అని రాయబడాలి. అదే ఆంగ్ల KJV లో తర్జుమా చేయబడింది.

అంతే కాదు నిత్య నరకాగ్నిని బోధిoచే వారు దుష్టులకు సైతం నిత్య జీవం ఉంటుందని అబద్ద బోధ చేస్తున్నారు. ఆత్మ చనిపోదు అంటే ఆత్మ జీవిస్తుందని అర్థము. కాని నిత్య జీవముకు వ్యతిరేక పధం నిత్య మరణం. అంతే కాదు జీవించి మనము చేసే ఏ పని కూడా మరణములో చేయలేము. అందుకే అది మరణము. కాని ఇప్పటి క్రైస్తవులు ద్రాక్ష రసం అనుకొని అజ్ఞానముతో  మధ్యపు  బోధను చేస్తున్నారు.

అలాగే నిత్య జీవము చేసే వారు పరలోకంలో జీవించడానికి జీవపు వృక్షము యొక్క ఫలములు తింటారు. మరి నరకాంలో ఉన్న వారు ఏమి తినకుండా ఎలా జీవిస్తారు? ఈ బోధ చేసేవారు చాలా ఆలోచించాలి. ఉదాహరణకు ఒక బాలుడు తమ తల్లి దండ్రుల అక్రమ పెంపకం వలన తప్పులు చేస్తూ అతి తక్కువ సంవత్సరాలు జీవించి మరణిస్తే, అట్టి వాడు నరకానికి వెళ్తాడు అని బైబిలు చెప్తుంది. కాని అతడికి మారు మనస్సుకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువ. మరి అతడు నిత్య నరకం అనుభవిస్తాడా? లేదు. కేవలం తన పాపాల కొలతను బట్టి శిక్షను అనుభవించి రెండవ మరణంలో మరణిస్తాడని బైబిలు చెప్తుంది. కాబట్టి ఇది న్యాయ వంతుడైన దేవుడు తీర్చే తీర్పు మరియు విధించే శిక్ష. ఆ శిక్ష కూడా న్యాయముగానే ఉంటుంది. ఇదే బైబిలు దేవుడి గొప్పతనము.

అలాగే మీరు బైబిలు బాగా చదివి దేవుని స్వభావమును ఇంకా బాగా తెలుసు కోవాలని నా ప్రార్థన. దేవుడు మిమ్ములను దీవించును గాక!