మరణము అంటే ఏమిటి?

బైబిలు ఒక్కసారి చదివిన ప్రతి ఒక్కరికి మనుష్యుని పాపము వలన సంభవించినదే మరణము అని తెలుసు. కాని ఈ మరణము అంటే ఏంటి? మరణించిన తరువాత ఏమి జరుగుతుంది? మరణములో జీవము ఉంటుందా? లేక అసలు మరణము అంటే జీవము లేకుండా ఉండటమా? అసలు ఎన్ని మరణాలు ఉన్నాయి?

మరి బైబిలు ఏమని చెప్తుందో పరిశోదిద్ధాము. దేవుని వాక్యము మాత్రమే మనకు ప్రామాణికము. అక్కడే మనకు సమాధానము దొరుకుతుంది.

రోమీయులకు 6:23 “పాపము వలన వచ్చు జీతము మరణము.”

పై వచనములో చూసినట్లయితే పాపానికి విధించబడిన శిక్ష మరణము. కాబట్టే అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన జీవమును కోల్పోయి మరణిస్తున్నారు. అయితే మనము అనుభవిస్తున్న మరణము కేవలం భౌతిక మైనదే కాని ఆత్మీయ మరణము కాదు. కాని పైన చెప్పిన వాక్యము ఆత్మీయ మరణము గురించి కూడా మాట్లాడుతుంది. ఆత్మ జీవిస్తుంది మరియు ఆత్మకు మరణము ఉండదు అని అన్య దేవుళ్ళని ఆరంధించే వారితో పాటు చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు కూడా బోధిస్తున్నారు. కాని బైబిలు ఏమి చెప్తుందో అన్వేషిద్దాము.

కీర్తనలు 13:4 “నేను మరణనిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.”

ధైవోపదేశములు చేస్తున్న దేవుని భక్తుడు మరణమును కేవలం ఒక నిద్రతో పోల్చాడు అనగా తెలివి లేకుండా పడియుoడడము అని చెప్తున్నాడు. అంతే కాదు ఆ మరణము చీకటి అని కూడా చెప్తున్నాడు.

మరి ఒక్కసారి సృష్టి కర్త అయిన దేవుడు మరియు నేనే జీవమును అని చెప్తున్న దేవుడు ఏమి చెప్తున్నాడో చూద్దాము. ఇది తన ప్రియుడైన లాజరు గురించిన సాక్ష్యము.

యోహాను 11:1-3,6 “మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బెతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను, ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

ప్రభువైన యేసు క్రీస్తు వినినప్పుడు ఇంకా తన పరిచర్య నిమిత్తము అక్కడే ఉండి రెండు దినముల తరువాత వారి దగ్గరకు బయలుదేరెను.

యోహాను 11:11-13 “ఆయన యీ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి. యేసు  అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. ”

మనము గమనించినట్లైతే ప్రభువైన యేసు క్రీస్తు అతని మరణము గురించి చెప్పెను. మరణము అంటే నిద్ర అని బైబిలులో చాలా స్పష్టంగా చెప్పబడింది. నిజంగా లాజరు మరణించాడా?

యోహాను 11:17 “యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.”

లాజరు చనిపోవడమే కాదు. నాలుగు దినములు సమాధిలో ఉన్నాడు. కాబట్టి ఈ సారాంశము మరణాన్ని నిద్రతో పోల్చడము చూస్తాము.

యూదుల చేత రాళ్ళతో కొట్టబడి చంపబడిన హతసాక్షి అయిన స్తేఫెను మరణము గురించి బైబిలు ఏమని చెప్తుందో చూద్దాము.

అపోస్తలుల కార్యములు 7:60 “అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను.

ఇక్కడ భక్తుడైన స్తేఫెను మరణమును నిద్రతో పోల్చడము మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

అలాగే ప్రభువైన యేసు క్రీస్తునందు మరణించిన వారు ఎలా ఉన్నారని బైబిలు చెప్తుందో చూద్దాము?

1 కోరింథీయులకు 15:51-52 “ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు,…”

కాబట్టి మృతులను నిద్రిస్తున్న వారిగా చెప్పడము ఇక్కడ మనము చూస్తాము.

బైబిలు ప్రకారము మరణము అంటే ఊపిరి, జీవము లేని నిద్ర.

మరి రెండవదిగా మరిణించిన తరువాత ఏమి జరుగుతుంది?

రాజైన హిజ్కియా రోగియై ఉన్నప్పుడు దేవుడు అతడు మరణించబోవుచున్నాడు అని తన ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పించినప్పుడు, హిజ్కియా దేవుడికి ప్రార్థన చేయగా జీవము గలిగిన దేవుడు అతడిని దర్శించి స్వస్త పరుస్తాడు. అందుకు హిజ్కియా తన మరణ స్థితి ఇలా ఉండబోయేది అని తనకు సంభవించిన దాని గురించి ఇలా సాక్ష్యమిస్తున్నాడు.

యెషయా 38:18-19 “పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు, సజీవులే గదా నిన్ను స్తుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించు చున్నాను.”

ఇక్కడ హిజ్కియా రాజు మరణమంటే ఎలాంటి స్తుతి మరియు కృతజ్ఞత లేని నిద్ర అని మరియు ఆ సమాధిలో సత్యము కూడా తెలుసుకోలేరు అంటే ఎవరు ఇక మారు మనస్సు పొందలేరు అని చెప్తున్నాడు.

కీర్తనలు 6:5 “మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?”

కీర్తనలు 115:17 “మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతిoపరు

దీనిని కీర్తనకారుడు మరణము అంటే ఒక మౌనస్థితి అని మరియు వారు దేవుడిని ఆ స్థితిలో స్తుతింపలేరు అని చెప్తున్నాడు.

కీర్తనలు 146:4 “వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.”

వారు కనీసం సంకల్పించుకోలేరు అని బైబిలు చెప్తుంది. అలాగే ఆ సంకల్పములు మరణించిన నాడే నశించును.

మరి చనిపోయి మౌనస్థితిలో ఉన్నవారు బైబిలుకు విరుద్ధముగా ఎలా నరకంలో అరుస్తూ ఉంటారో మీరే ఆలోచించి అర్థం చేసుకోవాలి.

ప్రసంగి 9:10 “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

పాతాళములో ఉపాయము తెలివి లేవు అని లేఖనాలు ఖచ్చితంగా చెప్తున్నాయి.

ప్రసంగి 9:5-6 ” బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.

వారికి అస్సలు సృష్టిలో ఏమి జరుగుతోందో తెలియదు. వారేమి దెయ్యాలు అయి వచ్చి మన మీద పగ తీర్చికోరు. అలాగే ఆత్మల రూపంలో వచ్చి దీవెనలు ఇవ్వరు. అలా కలల్లో వచ్చే మరణించిన వారందరు నిజము కాదు. మరణించినవారు ఏమి ఎరుగరు. ఏమి చేయలేరు. వారికి ఏ ఉపాయాలు రావు అని బైబిలు స్పష్టంగా చెప్తుంది. మరి మీ కలల్లో కనిపిస్తున్న మరణించిన వారు ఎవరు? సాతాను మరియు వాడి యొక్క  దూతలు.

ఒక్కటి కాదు రెండు కాదు ఇలా అనేకమైన వాక్యాలు సూటిగా మరణం అంటే ఏ ఆలోచన, ప్రేమ,ద్వేషము, ఉపాయము, తెలివి, సంకల్పము లేని నిద్ర అని చెప్తుంది. మరి ఇవన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రశ్నలకి మీరే సమాధానం తెలుసుకోండి.

కీర్తనలు 88:10-12 “మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా?(సెలా) సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు కొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా?

ఇలా మరణం అంటే బైబిలు ఒక నిద్రతో పోల్చుతుంది.

అయితే ఎన్ని మరణాలు ఉన్నాయని బైబిలు చెప్తుంది?

ప్రకటన గ్రంథం 2:11 “సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియుచెందడు.”

ఈ లేఖనం ప్రకారము రెండు మరణాలు ఉన్నాయన స్పష్టంగా అర్థమౌతుంది.

ప్రకటన గ్రంథం 20:6 “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు;”

మరి ఈ రెండవ మరణం ఏంటి?

ప్రకటన గ్రంథం 20:14 “మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.”

కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు చెప్పారు, శరీరమును చంపువారికి కాక ఆత్మను శరీరమును రెండిటిని నరకాగ్నిలో నాశనం చేసే దేవుడికి భయపడండి.

ఈ అగ్ని గుండంలో సంభవించేదే రెండవ మరణము.

అలాగే దేవుని రాజ్యములో చేరని వారికందరికి  రెండవ మరణము సంభవిస్తుంది.

ప్రకటన గ్రంథము 21:8 “పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

ఇలా రెండవ మరణములో అంతా సమాప్తమౌతుంది. పైన పేర్కొన బడిన వారందరు ఇక ఉనికిలో లేకుండా నశించిపోతారు.

మరి కొంతమంది నిత్య నరకము ఉంది. ఆ నిత్య నరకములో ఎప్పటికి అవిశ్వాసులందరు ఇక శాశ్వతాముగా కాలుతూ ఉంటారు అని చెప్తున్నారు.

అయితే ఈ ప్రశ్నకు సమాధానం కొరకు ముందుగా నరకానికి ఎవరెవరు వెళ్తారు అనేది చూడాలి.

ప్రకటన గ్రంథము 21:8 “పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.”

అంతే కాదు అన్యులై యుండి దేవుని ధర్మశాస్త్ర నీతిని చేయక పోయినప్పటికీ, తాము చారిటీ ట్రస్టులద్వారా చేసిన సేవ, రక్త దానముల ద్వారా సహాయములు చేసినవారు, అవసరతలో ఉన్న వారికి సహాయము చేసిన వారు, అలాగే అవిశ్వాసుల  అవిధేయ చిన్న పిల్లలు, విశ్వాసులై ఉండి తన సహోదరుని ద్వేషించిన వారు, సణిగే వారు, గొణిగే వారు, సోమరి వారు, విశ్వాసులం అని చెప్పుకుంటూ పైకి మంచిగా నటించి వెనకాల చాడీలు చెప్పేవారు ఇలా ఇంకా అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారందరు కూడా పాపము చేసిన వారే. వారు మరణించే లోపు మారు మనస్సు పొందకపోతే అందరు అగ్నిగుండంలో వేయబడి కాల్చబడతారు.

ఇప్పుడు చెప్పండి కేవలం వారు జీవించిన అతి తక్కువ కాలంలో వారి తల్లి దండ్రుల నీచమైన పెంపకం వల్ల అవిదేయతలో చనిపోయిన వారి దగ్గరనుండి మహా క్రూరులు దుష్టులు అయి క్రూరంగా నరహత్య చేసిన వారు, క్రూరంగా మాన భంగాలు చేసిన వారు ఇలా అందరూ కూడా ఒక్కటే శిక్షను అనిపిస్తారా? అందరు నిత్యము కాల్చబడుతూ ఉంటారా? దేవుడు ఎవరి కార్యాలను బట్టి వారికి తీర్పు తీర్చే దేవుడు అని బైబిలు చెప్తుంది.

అవును అందరికి ఒక్కటే శిక్ష. అదే రెండవ మరణము. మరణము అంటే ఇక ఉనికిలో లేకుండా పోవడము అని బైబిలు చెప్తుంది. ఆత్మ ప్రాణులతో సహా వారు పొగ వలె కనిపించ కుండా పోతారు మరియు వారి శరీరము బూడిద అయిపోతుంది.

కీర్తనలు 37:20 “భక్తిహీనులు నశించిపోవుదురు యెహోవా విరోధులు మేతభూముల సొగసును పోలియుందురు అది కనబడక పోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు.

నహూము 1:9 “యెహోవాను గూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవ మారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.”

ఆయన బొత్తిగా నివారణ చేస్తాడు అని చెప్తుంటే వీరు ఇంకా బాధ పడుతూనే ఉంటారు అని అబద్ద బోధలు చేస్తే దేవుడిని ఒక అన్యాయస్తుడిగా క్రూరుడిగా చూపిస్తూ ఆయన స్వభావమును తప్పుగా బోధిస్తూ అనేక మంది నాశనానికి కారకులు అవుతున్నారు.

కాబట్టి బైబిలు దేవుడు ప్రేమ స్వరూపి, క్షమించేవాడు, నీతిమంతుడు, న్యాయము చేసే వాడు, అలాగే పాపాలు చేసే వారిని వారు చేసిన కొలతను బట్టి శిక్షించేవాడు. ఇంక ఎప్పటికి పాపులు ఎక్కడ ఉనికిలో లేకుండా ఆత్మతో సహా జీవపు గ్రంథములో రాయబడని వారిని  నాశనము చేసే రెండవ మరణమే ఆ శిక్ష.

కాబట్టి మీకు తెలిసిన చిన్నపిల్లలు ఎవరైన చనిపోతే లేక మీరు మంచి వారిగా భావించే వారు ఎవరైనా అవిశ్వాసులుగా చనిపోతే బాధ పడకండి. వారు కేవలం క్షణంలోనే ఉనికి లో లేకుండా పోతారు. అంతే కాని వారు సాతాను లాగా ఎక్కువ సేపు తగల బడరు.

ఇంకా లోతైన అధ్యయనం కొరకు ఇక్కడ చదవండి.