దేవుని యొక్క స్వభావము
ప్రియమైన సోదరా సోదరీమణులారా మరియు స్నేహితులారా! మీకు క్రీస్తు నందు శాంతి సమాధానము కలుగును గాక! మనుష్యులుగా మనలో ప్రతి ఒక్కరికి మన మన మనస్సులలో విశ్వాస పద్ధతులు నిండి ఉంటాయి. అవి మన తల్లిదండ్రులు నేర్పించినవే కాని లేక మన ఉపాధ్యాయులు బోధించినవే కాని లేక మనలని ప్రేరేపించిన నాయకులను చూసి నేర్చుకున్నవే కాని లేక మన యొక్క స్వంత అనుభవాల ద్వారా నేర్చుకున్నవే కాని అవి ఎల్లప్పుడు మన మనస్సులను పట్టుకుని మనకు తెలియకుండానే మనలను నియంత్రిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనుష్యుని యొక్క ఆత్మలో తన విశ్వాస పద్ధతులను ప్రోత్సహించి నడిస్పిస్తున్న విషయాలను కనిపెట్టి తెలుసు కోవడం కొరకు అన్వేషణ మరియు పట్టువిడువని ప్రయత్నము జరుగుతూనే ఉంటుంది. ఇంకను మానవులు తమ విశ్వాస పద్ధతులను గురించి చేస్తున్న అధ్యయనము పూర్తికాక ముందే ఆత్మ ఆకలి ధప్పికలతో మరణించడం జరుగుతుంది. ఇంకను ఆత్మకు సంతృప్తి కలుగుట లేదు.
దానికి కారణము ఏమిటంటే మనుష్యుని యొక్క మనస్సు తాను పుట్టి పెరిగిన విశ్వాస పద్ధతులను తగిలించుకుని ఉండడమే. ఈ విశ్వాస పద్ధతులలో చాలా వాటిలో తర్కించి ప్రశ్నించే అర్హత కూడా ఉండదు. ఇది మనిషి యొక్క ఆత్మకు అగౌరవము మరియు శాపము. అయితే ఏ మనిషి యొక్క ఆత్మ అయితే లేచి ప్రశ్నించి తర్కించి సమాధానం పొందుతుందో ఆ ఆత్మే సంతృప్తితో జీవిస్తుంది లేక సంతృప్తితో మరణిస్తుంది. అవును ఎవరైతే దేవుడు ఎవరు? మరియు దేవుని యొక్క స్వభావము ఎలాంటిదో తెలుసుకోవాలనే అన్వేషణ కలిగి ఉంటారో వారు తప్పక సంతృప్తికరమైన సమాధానం పొందుతారు. ఒక పక్షపాతం లేని పరిశోధన వారిని సరియైన మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టే చివరిగా దేవుడు ఆయన యొక్క స్వభావమును అర్థము చేసుకోవడము కొరకు మిమ్మల్ని ఇక్కడికి నడిపించారని నేను నమ్ముచున్నాను.
దేవుని యొక్క పూర్తి స్వభావమును తేట పరచి వివరించిన ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకమే మనిషి కొరకు దేవుడు సిద్ధ పరచి ఉంచిన నిత్య సంతోషమును మనిషి గ్రహించడము లేదని చెప్తుంది.
“ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించినవారి కొరకు ఏమి సిద్ధపరిచెనో, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడియున్నది.”- 1 కోరింథీయులకు 2:9
ఈ పుస్తకము నుండి దేవుని స్వభావమును నేర్చుకోవుటకు అభ్యంతర పడవద్దు. ఇదే బైబిలు. అవును బైబిలు దేవుని యొక్క స్వభావమునకు ఖచ్చితమైన వర్ణన ఇచ్చింది.
అన్నింటి కంటే మొదటిగా బైబిలు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని తెలియపరుస్తుంది.
1 యోహాను 4:8 – “దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు.”
1 యోహాను 4:16 “మనయందు దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమ యందు నిలిచి యుండువాడు దేవుని యందు నిలిచి యున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. ”
దేవునికి మరియు ఆయన యొక్క సృష్టికి ప్రేమే మూలమై యున్నది. ఆయన నిన్ను నిత్యమైన ప్రేమతో ప్రేమించడానికి సృష్టించాడు. అందుకే ఆయన ఈ సృష్టిలో అనేకమైన బాంధవ్యాలను కలుగజేశాడు. అలా ఎలాగ మన కన్న తండ్రి లేక మన కన్న తల్లి మనలని ప్రేమిస్తారో, అంతకంటే ఎక్కువైన మాధుర్యమైన ప్రేమ ఆయన దగ్గర ఉందని ఈ వాక్యాల్లో తెలియ పరచబడింది.
కీర్తనలు 103:13 “తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.”
సామెతలు 3:12 “తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.”
యెషయా 66:13 “ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.”
అంతే కాదు మనము అమ్మ నాన్న లేక భార్య లేక సహోదరులతో కూడా పంచుకోని అనేక విషయాలు పంచుకొనే స్నేహితుడిగా కూడా మనలను చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు..
యోహాను 15:13,14 “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు”
అయితే ఇంత అత్యంతమైన ప్రేమ వాత్సల్యతలను చూపించే దేవుడను ఎవరు వదులుకుంటారు. ఆయన అంత ప్రేమా మయుడు కాబట్టే ఈ రోజున మనము ఇంత మంది మనుష్యులు ఆయన ప్రేమను పొందాలని ఆకలి ధప్పికలతో ఆయన దగ్గరకు వెళ్తున్నారు మరియు క్రీస్తును పోలి జీవించే క్రైస్తవులుగా మారుతున్నారు.
అయితే ఎందుకు ఈ లోకములో బాధలు మరియు వేదనలు ఉన్నాయని మీరు అడగొచ్చు. ఈ బాధలు అన్నింటికీ కారణము ఏమిటి? మరియు ఈ బాధలకు కారకులు ఎవరు?
ఆ ప్రశ్నకు జవాబు చాలా సులువు. ఇదే పాపము. ఈ బాధలు అన్నింటికీ కారకుడైన వ్యక్తి దేవుని యొక్క పడిపోయిన దూత అయినటువంటి సాతాను.
మరి దేవుడు మనిషి బాధలు అనుభవించడానికి సాతానును ఎందుకు అనుమతించాడు? మరియు దేవుడు మానవ జాతిని రక్షించడం కొరకు సాతానును ఎందుకు నాశనం చేయలేదు?
అన్నింటికంటే ముందుగా దేవుడు నాశనం చేయడానికి సృష్టించలేదు. నాశనం చేయడం ఆయన యొక్క ఉద్దేశము కాదు మరియు నాశనం చేయడం ఆయనకు అన్యమైన కార్యము. దేవుడు సమస్తమును ప్రేమతో ఉల్లాసించదానికే సృష్టించాడు కాని నాశనము చేయడము కొరకు కాదు. ఇక్కడే క్షమా గుణము అనేది దేవుని యొక్క స్వభావములో మనకు కనబడుతుంది.
కీర్తనలు 86:5 “ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొర్రపెట్టువారందరియెడల కృపాతిశయము గల వాడవు.”
“…మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పధై యుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.” – లూకా 6:35
దేవుడు తన సృష్టి మారి తన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు. కాబట్టే సమస్తమునందు ఆయన కృప నిండి ఉంది.
మరి దేవుడు అలా నాశనం చేస్తూ ఉంటే ఆయన సృష్టి యొక్క ప్రయోజనము ఏమిటి?
మరియు ఇప్పుడు ఈ సాతానును నాశనం చేస్తే తరువాత వేరొక అదే మనస్సు గల ఇంకొక దూత లేస్తాడు. మరల ఆయన ఆ దూతను కూడా నాశనం చెయ్యాలి. ఈ నాశనం చేసే ప్రక్రియ ఎప్పటికి కొన సాగుతూనే ఉంటుంది. మరి ఆయన సృష్టి యొక్క ఉద్దేశము ఏమిటి? అందుకే దేవుడు సాతానును నాశనము చేయలేదు. దానికి బదులుగా ఆయన యొక్క నిత్యమైన ప్రేమ సమస్త సృష్టికి చూపించాలని అనుకున్నాడు.
ఒక సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించాలే కాని సమస్యను తుడిచివేయకూడదు. దేవుడు ఈ సమస్యకు శాశ్వతముగా పరిష్కరించాలి అనుకున్నాడు. ఆ పరిష్కారం ఆయన యొక్క ప్రేమ అనే పునాది మీద వేయబడింది. ఉదాహరణకి మీకు మీరు అత్యంతగా ప్రేమించే మరియు ఎల్లప్పుడూ మీ చేతుల్లోనే ఉండే పిల్లవాడు ఉన్నాడు. మీరు ఆ పిల్లవాడిని చాలా ప్రేమించారు ఎంతగా అంటే ఆ పిల్లవాడి యొక్క చావు తలంపు కూడా మిమ్మల్ని రోగిష్టి వారిని చేస్తుంది. ఆ పిల్లవాడు మీ యొక్క శ్రద్ధ మరియు ప్రేమ చూస్తూ పెరుగుతున్నాడు. కాని కొన్ని బలవంతమైన పరిస్థుతుల వలన అతడు మీతో అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు మీరు ఏమి చేస్తారు? మీరు ఆ అబద్ధము ఆడినందుకు ఆ పిల్లవాడిని చంపి వేస్తారా? మీరు మొదటి సారిగా అబద్ధాల వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్తూ మందలిస్తారు. అతడు దానిని మరల చేశాడు. ఈ సారి మీరు ఏమి చేస్తారు? మీ యొక్క మందలింపు కొంచెము గట్టిగా ఉంటుంది. ఈ సారి తన యొక్క తోటి అమాయకమైన విద్యార్థిని కొట్టాడు అనుకోండి, ఇప్పడు మీరు ఏమి చేస్తారు? ఇప్పటికి కూడా మీరు ఆ పిల్లవాడిని చంపరు కాని ఇంకొంచెము గట్టిగా దిద్దుబాటు చేయాలని ప్రయత్నిస్తారు. అదే సమయంలో అతడిని మార్చడానికి తగిన పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అధిక ప్రేమను మీరు చూపాలని అనుకుంటారు. మీరు ఆ పిల్లవాడిని ప్రేమిస్తున్నారు కాబట్టి వీటన్నింటిలో మీరు అతడిని ఎప్పుడూ చంపాలని అనుకోరు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీ సొంత చేతులతో ఆ పిల్లవాడిని నాశనం చేయాలంటే మీరు ఎంత కుమిలి పోతారు? ఇలాంటి స్వభావమే దేవునిలో బయలు పరచబడింది. మీరు సాతానుని లేక దుష్టులను నాశనము చేయొచ్చు కదా అని కేవలం ఒక్క మాటలో అనేయొచ్చు. మరి దేవుని యొక్క హృదయం వారిని నాశనం చేయడానికి ఎంత రోదిస్తుందో ఆలోచించండి. అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు
యెషయా 55:7-9 “భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవా వైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలి పడును వారు మన దేవునివైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులవంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి.”
మనము అపరిమితమైన దేవుడిని ఒక పెట్టెలో పెట్టి మన పరిమితమైన మనస్సులతో ఆయన యొక్క స్వభావమును ఎప్పటికి ఊహించలేము. ఆయన సర్వశక్తి గల దేవుడు మరియు ఆయన యొక్క ఆలోచనలు మరియు తలంపులు మనుష్యుల గ్రహింపునకు అందనివి లేక మిన్నయైనవి అని మనము తెలుసుకోవాలి.
దేవుని యొక్క స్వభావము పరిశుద్ధమైనది, స్వచ్ఛమైనది, పరిపూర్ణమైనది మరియు నీతిమంతమైనది. దేవునితో నివసించే వారు కూడా పాపములేని వారై ఉండాలి. ఎందుకంటే పాపము కాని పాపి కాని దేవుని పరిశుద్ధత ముందు నిలువలేరు. వారు దేవుని యొక్క పరిశుద్ధత ముందు క్షీణించి పోతారు.
1 పేతురు 1:16 “మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”
మత్తయి 5:48 “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.”
మంచికి చెడ్డకి మరియు వెలుగుకి చీకటికి జరుగుతున్న ఈ గొప్ప పోరాటం కేవలము దేవుడు తన సృష్టికి నాశనము చేస్తూ లేక సిక్షితూ ఉండే క్రూరమైన దేవుడిగా కాకుండా ఒక ప్రేమించే తండ్రిగా నిరూపించుకోవదమే ఉన్న మార్గము.
కాబట్టే దేవుడు సాతాను యొక్క కుయుక్తులను మరియు కార్యములను అనుమతించాడు. ఎందుకంటే చివరికి దేవుడు తన సృష్టి అంతటి ముందు ఎవరు మంచో లేక ఎవరు చెడ్డో మరియు ఎవరు నిజమో లేక ఎవరు తప్పో నిరూపిస్తాడు.
ఈ కారణము చేతనే మనము అనేక రకములైన విశ్వాస పద్ధతులలో జీవిస్తున్నాము. ఇప్పుడు మనము చూస్తున్న అనేక రకములైన మతాలు మరియు ఆరాధన పద్ధతులే దేవుడు హెచ్చరించే వాడే కాని బలవంతము చేసే దేవుడు కాదనడానికి నిరూపణ. మనిషి దేవునివైపు నిలిచి రక్షింపబడాలా లేక తన ఇష్ట ప్రకారముగా జీవించి నాశనమైపోవాలా అనేది మనిషి ఎంచుకునే నిర్ణయము.
ఈ కారణము చేతనే ఈ లోకములో చాలా వేదనలను చూస్తున్నాము. కాని క్రైస్తవంలో ఉన్నట్లుగా ఇంత సులువైన రక్షణ బహుమానము ఎక్కడా లేదు. ఔను! ఇది నిజము.
దేవుడు సమస్తమును నిత్యము జీవించుట కొరకే సృష్టించాడు. ఆయన దేనిని నాశనము చేయడం కొరకు సృష్టించలేదు. ఆయన ఈ లోకమును ఎంత ప్రేమించాడంటే ఆయన ఈ లోకానికి తన ప్రేమను తన యొక్క అర్పణ ద్వారా చూపించాడు.
యోహాను 3:16 “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”
ఎందుకు దేవుడు తన కుమారుని అర్పించాల్సి వచ్చింది?
అది పాపము వలననే.
పాపము అంటే ఏమిటి?
1 యోహాను 3:4 ”…ఆజ్ఞాతిక్రమమే పాపము.”
పాపము వలన వచ్చే జీతమే ఏంటి?
రోమీయులకు 6:23 “ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము”
పాపము దేవుని నుండి తన ప్రజలను వేరు చేసింది. కాబట్టే దేవుడు మనిషిని తిరిగి తనతో సమాధాన పరుచుకోవడం కొరకు మార్గమును సిద్ధ పరిచాడు. దానికి ఉన్న ఒకే ఒక్క మార్గము. అది తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ మరియు మరణము.
ఆ కారణము చేతనే యేసు క్రీస్తు భూమి మీద తాను జీవించిన కాలంలో ఇలా చెప్పాడు.
యోహాను 14:6 “యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు.”
అవును యేసు క్రీస్తు మాత్రమే మార్గము. మీరు మిమ్ములను ప్రేమించి మీ కోసం ప్రాణం పెట్టి మరణించిన యేసు క్రీస్తుని మాత్రమే అర్థం చేసుకొని ప్రేమించలేక పోతే మరి మీరు ఎంత ఎక్కువగా దేవుడిని కాని మీ పొరుగువారిని కాని ప్రేమిస్తారు? ఇది చాలా స్పష్టంగా తేటగా తెలుస్తుంది.
మిమ్ములను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుని యొక్క ప్రేమ ఇదే. మీరు ఆయనను ద్వేషించినప్పుడే మీ పాపముల అన్నిటి కొరకు ఆయన మరణించాడు.
2 పేతురు 3:9 “కొందఱు ఆలస్యము అని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్ధానమును గూర్చి ఆలస్యము చేయు వాడు కాడు గాని ఎవడును నశింపవలెనని యిచ్చయింపక, అందరు మారు మనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతము గలవాడై యున్నాడు.”
ఆయనకు ఎవరూ కూడా నశించుట ఇష్టం లేదు. కాకపోతే మీరే ఏ కారణము లేకుండా మీ స్వనాశనము కొరకు దేవుడిని ద్వేషిస్తూ మీ సొంత మార్గాన్ని మీరు ఎంచుకున్నారు. ఇది కేవలము ఆయన పాపము లేకుండా జీవించమని చెప్పాడు కాబట్టే.
అంతే కాదు ఆయన ఏ మనిషిని కూడా పాపము చేయమని ప్రోత్సహించడు.
యాకోబు 1:13 “ దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.”
మిమ్మల్ని ఎంతో ద్వేషించి నాశనము చేయడానికి ఒక శత్రువు కాచుకుని ఉన్నాడు. ఈ పడిపోయిన దేవుని దూత పేరు సాతాను. సాతాను అనే పేరుకు అర్థము తిరుగుబాటు దారుడు. ఔను, ఆ పేరు దేవుని మంచి మరియు న్యాయమైన ధర్మశాస్త్రమునకు విరోధముగా చేసిన తిరుగు బాటును సూచిస్తుంది. అతడే మిమ్ములను పాపములకు రేపే వాడు మరియు చివరికి మిమ్మల్ని నాశనం చేసేవాడు.
యాకోబు 1:14 “ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడ్వ బడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.”
కాబట్టి పాపి యొక్క జీవితము మరణము ద్వారా అంతమవుతుంది. కాని దేవుడు ఎప్పటికి అన్నింటిని చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మిమ్మల్ని శోధనల నుండి రక్షించుట కొరకు మీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు.
1 కోరింథీయులకు 10:13 “సాధారణ ముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును. ”
కాబట్టే యేసుక్రీస్తు మీ పాపముల కొరకు శిక్షగా మారి నిస్వార్ధమైన ప్రేమను చూపించాడు. యేసు క్రీస్తు ప్రభువు వారు భూమి మీద జీవించిన జీవితము పరిపూర్ణమైన దేవుడి యొక్క స్వభావమును ప్రతిబింబిస్తుంది. ఆయన పరిపూర్ణమైన పాపము లేని జీవితమును జీవించాడు.
1 పేతురు 2: 21-23 “ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ”
1 యోహాను 3:5 “ పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు. ”
2 కోరింథీయులకు 5:21 “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.”
ఇది చదువుతున్నా ఓ ప్రియ ప్రశస్తమైన ఆత్మా, మానవుల రక్షణకొరకు మానవుల శరీరముల బయలు పరచబడిన దేవుని ప్రేమను అర్థం చేస్కోమని వేడుకొనుచున్నాను. మనము పాపులము, మనము చీకటిలో ఉన్నాము. మనకి దేవుని యొక్క ప్రేమ తెలియదు గనుక మనము దేవుని వెలుగులోకి రాలేక పోతున్నాము. గనుకే ఇలా వ్రాయబడి యున్నది
యాకోబు 1:17 “శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.”
ఆయన ఒక్కటే రీతిగా ఉండే దేవుడు. ఆయన మారడు. మనము యేసు క్రీస్తు యొద్దకు ధైర్యము చేసి రాకపోవడానికి ఒక కారణము ఉంది.
యోహాను 1:4-9 ” ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.”
అవును మనము ఏ పాపము వలన చీకటిలో కప్పివేయబడ్డామో ఆ చీకటి నుండి బయటికి రావడము కొరకు యేసు క్రీస్తు మనలను వెలిగిస్తాడు. ఇదే మనము వెలుగు చేత వెలిగింపబడి ఎప్పటికి ప్రకాశిస్తూ ఉంటామా లేక నాశనం అయిపోతామా? అనేది మనము దేవుడిమీద చూపించే ప్రేమ మీద ఆధార పడి ఉంది.
యోహాను 3:19-20 “ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ”
ఈ కారణము చేతనే అనేక మంది నాశనము అవుతున్నారు. ఎందుకంటే వారు చెడును ప్రేమిస్తున్నారు కాబట్టి. వారు అబద్ధాలు ఆడుటకు, బూతు నోరు కలిగి ఉండుటకు, ఇతరుల మీద అసూయ పడుటకు, ఇతరుల వాటిని లోభించుటకు మరియు ప్రతీకారము తీర్చుకునే హృదయం కలిగి ఉండుటకు బాధ పడరు.
దేవుడు పూర్తిగా అసహ్యించుకునే కొన్ని పాపాలను చూద్దాము.
సామెతలు 12:22 “అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు ”
సామెతలు 6:16-17 “యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు. అవేవనగా అహంకారధృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును, లేని వాటిని పలుకు అబద్ద సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.”
కీర్తనలు 11:5”యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు”
యిర్మీయ 22:3 “యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడినవానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.”
సామెతలు 11:1 “దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.”
సామెతలు 20:23 “వేరువేరు తూనికే రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగాత్రాసు అనుకూలము కాదు.”
కీర్తనలు 16:5 “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు”
సామెతలు 21:4 ”అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తి హీనుని క్షేమమును పాపయుక్తములు.”
1 కోరింథీయులకు 6:9-10 “అన్యాయస్థులు దేవును రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులినాను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.”
విగ్రహారాధకులను గురించి ఒక్క సారి ఆలోచిద్దాము. ఎందుకు విగ్రహారాదకులు దేవుని రాజ్యమునకు రారు?
ఎందుకంటే విగ్రహారాధన అనేది నిజము కాదు కాబట్టి. అది కేవలం అబద్ధం మాత్రమే.
కీర్తనలు 115:4-6 “వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసన చూడవు”
యెషయా 44:9-10 “విగ్రహమును నిర్మించు వారందరు మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు, వారు గ్రహించు వారు కారు ఎరుగువారు కారు గనుక అందుకు సిగ్గు పడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని దేవునిగా నిరూపించువాడెవడు? ”
యెషయా 44:11-13 “కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్ళు త్రాగక సోమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రికలతో దాని చెక్క చేయును కర్కాటకములతో గురుతు పెట్టి దాని రూపించుచు మందిరములో దాని స్థాపింపవలెనని నరరూపముగల దానిగాను నరసౌందర్యముగలదానిగాను చేయును. ”
యెషయా 44:14-20 “ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని పూనుకొనును శ్మశానావృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసికొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును. ఒకడు పొయ్యెకట్టెలకు వాటి నుపయోగించును వాటిలో కొంత తీసుకుని చలి కాచుకొనును నిప్పు రాజపెట్టి రొట్టె కాల్చుకొనును ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసికొనును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి యున్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు ఆహా, చలి కాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిల పడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్ధించును. వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను.ఎవడును ఆలోచనచేయడు, నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పులమీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని మిగిలినదానిని తీసికొని దానితో హేయమైనదాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? అని యెవడును ఆలోచింపడు యోచించుటకు ఎవనికిని తెలివిలేదు వివేచనలేదు. వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవుచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు.”
కాబట్టే విగ్రహారాధకులు కూడా దేవుని రాజ్యమునకు అర్హులు కారు అని అది ఒక పాపము అని చెప్తుంది. వారు దేవుని చూడకపోయినా ఒక ఊహా రూపమును గీసి దాని బొమ్మను చేసి అబద్ధమైన దానిని నిజమని చెప్పి పూజిస్తారు. ఉదాహరణకి ఒక్క సారి రెండు విగ్రహములు పక్క పక్కన పెట్టి పోల్చి చూడండి. ఆ రెండు విగ్రహములు ఖచ్చితంగా మక్కు కి మక్కు ఒకే లాగా ఉంటాయా? ఉండవు. ఒక విగ్రహములో మూతి ఎక్కువగా ఉంటే ఇంకొక విగ్రహములో ముక్కు ఎక్కువగా ఉంటుంది. దీనికి దానికి పోలికే ఉండదు. కాని మీరు రెండిటికి ఒకటే పేరు పెట్టి పూజిస్తారు. ఇప్పుడు ఆ రెండింటిలో ఏది నిజమైన రూపము? అసలు అవి ఖచ్చితంగా దేవుని రూపాలేనా? మనకు తెలియదు. అయినా కూడా వాటిని ఆరాధిస్తారు.
కాని నిజమైన దేవుడు కేవలము సత్యము. ఆయన పరిశుద్ధుడు మాత్రమే. ఆయనలో ఏ మచ్చ కాని లోపము కాని లేదు. దేవుడు తల్లి గర్భములో మిమ్మల్ని తన చేతులతో రూపించేటప్పుడు కనీసం కొంచెం నొప్పి కూడా లేకుండా చేస్తాడు. కాని వారు ఆ రాయిని గాని లేక మొద్దుని కాని కొట్టి కొట్టి నొక్కులు కొట్టి కొట్టి చేస్తారు. అంటే మీరు దేవుడిని ఒక రాయిగా పోలుస్తున్నారా? ఒక ఉలుకలేని పలుకలేని రాయి వంటి స్వభావముతో పోలుస్తున్నారా? ఆలోచించండి. మన పాపపు చేతులతో, మన క్షయమైన శరీరముతో పరిశుద్ధమైన మరియు అక్షయమైన దేవుడిని చేయగలమా? జీవము గల దేవుని ఒక జీవము లేని విగ్రహములో ఉండమంటే ఆయన ఉంటాడా? ఈ సృష్టి అంతా ఆయనది. ఈ భూమ్యాకాశాలు సమస్తము ఆయన చేతులతో చేయబడ్డాయి. మీరు ఆ విగ్రహాలు చేయక ముందే దేవుడున్నాడు. మరి ఎందుకు మీరు అపరిమితమైన దేవుని ఒక విగ్రహముగా నాలుగు గోడల మధ్యలో పరిమితంగా ఉంచాలనుకుంటున్నారు? మీరే ఆలోచించండి.
నిర్గమకాండము 20:1-17 “దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు.
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.”
బైబిలులో దేవుడిని నేరుగా చూసిన వారు కాదు కాని దేవుని ప్రభావమును చూసిన వారు ఏమని సాక్షమిచ్చారో మీరే చూడండి.
నిర్గమకాండము 34:5 “మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా.”
కీర్తనలు 86:15 “ ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములుగల దేవుడవు ధీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు”
ఇవి కేవలం ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు మాత్రమే. ఆయన యొక్క మహా గొప్ప నీతి న్యాయములు , మనుష్యులపైన ఆయనకున్న అనంతాతీతమైన ప్రేమ ఆయన పక్షపాతము లేకుండా అందరిని ఒకటే రీతిగా చూస్తాడని మనకి బైబిలు చదివితే అర్థమౌతుంది. ఎవరో రాసిన పుస్తకాలు కాదు బైబిలులో ఉన్న నిజమైన చరిత్ర ప్రవచనాలు అన్నీ కూడా ఆయన ఆది నుండి దేవుడు అని నిరూపిస్తాయి.
విగ్రహారాధన గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. మీరు దేవుడిని గనుక హృదయపూర్వకముగా నమ్మినట్లితే, మీరు ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా రక్షింపబడడానికి సాకుల గురించి కనీసం ఆలోచించను కూడా ఆలోచించరు. మేము కూడా మిమ్మల్ని మా హృదయ పూర్వకంగా వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నాము. అలాగే దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో, వివేకముతో, వివేచనా శక్తితో మరియు శాంతి సామాధనములతో దీవించి మరియు తన యొక్క కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము ద్వారా తాను చూపించిన అతి గొప్ప ప్రేమను చూడగల కన్నులు, వినగల చెవులు, గ్రహించగల హృదయమును మీకు అనుగ్రహించాలని మనస్సారా ప్రార్థిస్తున్నాము!
మీకు సమాధానము కలుగును గాక!
దేవుడు మిమ్మల్ని దీవించును గాక!