నిత్య జీవము
ఈ భూమి మీద నివసించే ప్రతి జీవ రాశి మరి ముఖ్యంగా మనుష్యులు సైతం వారి వారి ప్రాణం కాపాడుకోవడం కొరకు నిరంతర పోరాటం చేస్తున్నారు. పుట్టిన పసి పాప మొదలుకొని మరణ శయ్య మీద ఉన్న పండు ముసలి వారి వరకు తాము ఎలాగైనా జీవించాలని చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నారు. మనము తినే ఆహారము త్రాగే నీరు అంతా కూడా మనము జీవించడానికే. పసి పిల్లలు పాలు త్రాగి బ్రతకాలని ఏడుస్తారు, రోగులు రోగము తగ్గి చావకుండా బ్రతకాలని తమ సాయశక్తులా పోరాడతారు. ముసలివారు చావకుండా ఇంకా కొంతకాలమైన బ్రతకాలని పోరాడతారు. జంతువులు సైతం బ్రతకడం కొరకు ఆహారం ఎలైగైనా సంపాదించాలని పోరాడతాయి. ఇలా ప్రతి యొక్క జీవి నిరంతర నిరంకుశ పోరాటము జీవము కొరకే. ధనవంతుడి దగ్గర నుండి బీద వాడి వరకు అందరు కలిగి ఉన్న అత్యున్నతమైన లక్ష్యము జీవం లేక ప్రాణం. ఆ ప్రాణం కాపాడుకోవడం కోసం మనము ఎన్నో కష్టాలు పడతాము. ఆ ప్రాణాన్ని కాపాడడానికే వైద్యులు. ఆ ప్రాణాన్ని కాపాడడానికే ఆసుపత్రులు. మనము చదివే చదువు, సంపాదించే సంపాదన అంతా కూడా ఆ ప్రాణాన్ని లేక తోటి ప్రాణులను బ్రతికించడానికే. ధనవంతుడు తనకు ధనమును సంపదాదించుకొనేది తన ప్రాణమును సుఖపరచుకోవడము కొరకే. మనము చూస్తున్న ఈ టెక్నాలజీ అంతా కూడా ప్రాణము కొరకే. దేశము యొక్క భద్రతా దళాలు రక్షణ దళాలు అన్ని పని చేస్తుంది వారి వారి దేశ జనాల ప్రాణాలు కాపాడడానికే. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు లాంటి అనేక ఆయుధాలు అన్నీ ప్రాణాలు కాపాడడానికే. ఎన్ని కష్టాలు పడినా ఆ ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఆపలేము. కాబట్టి మనలను నియంత్రించే ఒక మానవాతీత శక్తిని మనము చూడగలము. ఆయనే దేవుడు. ఆయనే జీవము కలిగి ఉన్నవాడు. జీవమరణముల పైన అధికారము కలిగి ఉన్నవాడు.
మనుష్యుల బాధలను మరియు వ్యధలను చూడలేని దేవుడు తానే మనుష్యులను మరణము అనేది లేకుండా జీవిoచడానికి ఒక మహత్తరమైన ఏర్పాటును చేశాడు. అదే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క త్యాగము. ఆ యేసు క్రీస్తే జీవము. ఆ జీవమును అంగీకరించి స్వీకరించిన వారికే మరణమనేది లేని నిత్య జీవము. ఆ జీవమై యున్న యేసు క్రీస్తుని అంగీకరించని వారికి జీవమనేది లేని మరణము. అంతే కాదు ప్రియమైన ఆత్మ, దారి తప్పిన మనుష్యులను తిరిగి జీవమై ఉన్న యేసు క్రీస్తులో నడవడానికి ఉదాహరణలతో కూడిన సూత్రాల పత్రిక ఒకటి దేవుడు మనుష్యుల కొరకు వ్రాసాడు. అదే బైబిలు.
ప్రియ ప్రశస్తమైన ఆత్మ, బైబిలు అనేది దేవుడు మనుష్యుల కొరకు రాసిన రాయబార పత్రిక. కాబట్టే ఆ పత్రికలోనే ఆయనను నమ్మి పాపములేని ఆయన స్వభావమును అనుకరించి నడిచిన వారికి ఆయన బహుకరించే నిత్య జీవము ఎలా ఉంటుందో కూడా వివరించాడు.
మొదటిగా నిత్య జీవము ఎవరు పొందుతారో చూద్దాము?
“నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.” – మత్తయి 25:40
కేవలము నీతిమంతులు మాత్రమే నిత్య జీవము పొందుతారు. దేవుడు బైబిలు ద్వారా ఆదేశించిన నీతి వాక్యములు పాటించడం ద్వారా నీతిని అనుసరించిన నీతిమంతులుగా నిత్య జీవమును పొందుతారు. ఏ అవినీతిపరుడు అనగా బైబిలులోని నీతి వాక్యములను అనుసరించని ఏ వ్యక్తి కూడా నిత్య జీవమునకు యోగ్యుడు కాదు.
బైబిలు వ్రాసిన దేవుడు మాత్రమే తాను ఆదేశించిన ప్రకారము మాత్రమే జీవించాలని చెప్పాడు. కాబట్టే బైబిలు పరిపూర్ణమైనది మరియు పరిశుద్దమైనది. కాని ఇతర మతాల వారు ఎవరు ఇష్టం వచ్చినట్లు వాడు జీవించి అదే దేవుడు చెప్పాడు అని మార్చి మార్చి చెప్తూ ఉంటారు.
బైబిలు నీతి వాక్యములకు బైబిలు రాయించిన ప్రభువైన యేసు క్రీస్తే ఆదర్శం. కాని మిగతా మతాలలో ఒక ఆదర్శం ఉండదు. ఒక ప్రామాణికము ఉండదు. బైబిలు ప్రకారము నీతి మరియు అవినీతి రెండే ఉన్నాయి. మంచి మరియు చెడు రెండే ఉన్నాయి. అంతే కాని కొంత మంచి కొంత చెడు అంటూ ఏమి లేదు. మంచి నీటిలో కొన్ని నలకలు పడిన అవి చెడి పోయిన నీరే. అలాగే మంచిలో కొంచెం చెడు కలిసిన అది చెడే. అది కలుషితము. అదే బైబిలు బోధిస్తుంది.
కాబట్టే అటువంటి నీతి మంతుల జనములతో జల ప్రవాహముల వలె పొంగి పోర్లేదే నిత్య జీవ రాజ్యము. ఇటువంటి నీతిస్వరూపుడైన దేవుని మీద తిరుగబడి మా ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తాము అనే నీతి ద్వేషులకు ఎలాగ నిత్యజీవ రాజ్యములో పౌరసత్వము దొరుకుతుంది? వారు ఎలాగ నిత్య జీవ రాజ్యములో స్వాస్త్యము పొందగలరు?
చట్ట భద్రత నియమములు కలిగి ఉన్న ఒక పట్టణములోకి గాని ఒక దేశము లోనికి ఒకడు ప్రవేశించి ఆ పట్టణములో కాని ఆ దేశములోని చట్టాలను అతిక్రమిస్తే, అతడిని ఏమి చేస్తారు? అతడిపై చర్య తీసికొని అతడిని బహిష్కరించరా? అలాగే నిత్య జీవ దేవుని రాజ్యము కూడా! దేవుడు జీవించడానికి నియమించిన చట్టాలను అతిక్రమిoచే వారికి జీవము ఇవ్వబడదు. వారు జీవపు ప్రపంచంలోకి ప్రవేశించలేరు.
శాంతి సమాధానములతో విస్తార జనముల ఐక్యతతో నిండి ఉండే రాజ్యములో ఒక్క అవినీతిపరుడు ప్రవేశించి అక్కడ దొంగతనాలు చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అబద్ధాలు చెప్తూ కొండెములు చెబుతూ అక్కడ వారిని హింసిస్తూ బాధిస్తూ పగతో కక్షతో పైశాచికంగా ప్రవర్తించే వారికి నిత్య జీవ రాజ్యములో స్థానం ఉండదు. ఇక్కడ అవినీతి పరమైన మనస్సును నీతిని జరిగించడానికి మార్చుకోని వారికి అనగా మారు మనస్సు పొందని వారికి నిత్య జీవములోకి ప్రవేశము ఉండదు. వారికి విధించబడే శిక్ష మరణము మాత్రమే.
అంతేకాని దొంగతనాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, వ్యభిచారము చేస్తూ, మతం పేరుతో కాని, కులం పేరుతో కాని లేక ఇక వేరే కారణాల వలన ఇతరులను హేళన చేస్తూ హింసిస్తూ చంపుతూ ఉండే అవినీతి పరులకు వారి యొక్క దుష్టత్వము జరిగించడానికి జన్మ జన్మల అవకాశం ఇస్తూ వారిని చూస్తూ ఊరకుండే దేవుడు కాదు బైబిలు దేవుడు. సాత్వికులను, వినయ మనస్కులను, బీద వారిని, హింసింపబడిన వారిని, అనాథలను మరియు విధవరండ్రను తన బాహువు చాచి తన బాహు బలముతో లక్షల కోట్ల బలాత్కారుల సైన్యముల చేతులలో నుండి విడిపించగల సర్వ శక్తిమంతుడు బైబిలు దేవుడు.
“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.” – కీర్తనలు 24:3-4
“అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.” – కీర్తనలు 35:10
ప్రతి మనిషికి స్వేఛ్చ స్వాతంత్ర్యం అవసరము. ఆ స్వేఛ్చ స్వాన్తంత్ర్యమే దేవుని పరలోక రాజ్యము. సత్యమును అభ్యసించి నీతిమంతులుగా మారిన వారు మాత్రమే ఆ నిత్య జీవమునకు వారసులు.
ఎవరైతే నీతి మంతులుగా మారి తమ ప్రాణాలు సైతం తెగించి ఆ నీతి కోసం జీవిస్తారో వారే నిత్యజీవము పొందనర్హులు.
“మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును.”-గలతీయులకు వ్రాసిన పత్రిక 6:8
“అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.”- 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6:9-10
“శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.” – గలతీయులకు 5:19-21
కాబట్టి ఆత్మ ఫలములైన “సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము”(గలతీయులకు 5:22) కలిగి ఉన్న వారితో నిండి ఉండే నిత్య జీవ దేవుని రాజ్యములో నరహంతకులు, దొంగలు, వ్యభిచారులు లాంటి దుష్టులు ప్రవేశిస్తే అది శాంతి సమాధానాలతో నిండి ఉండే దేవుడి రాజ్యము ఎలా అవుతుంది?
కాబట్టే అనీతిమంతులకు నిత్యజీవము లేదు. వారికి విధింపబడే శిక్ష నిత్యమరణము.
కాబట్టి చివరిగా ఎవరైతే తమ సిగ్గును విడిచిపెట్టి ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మి తమ పాప జీవితమును అసహ్యించుకొని తమ పాపాలను తెగువతో ఒప్పుకొని, విడిచిపెట్టి, దేవుడు నియమించిన నీతి జీవితాన్ని జీవిస్తారో వారే నిత్య జీవ దేవుని రాజ్యమునకు వారసులు.
బహుశా ఎల్లప్పుడూ దేవుడు ముందే ఉంటాము గనుక విసుగు పుట్టదా? అని మీరు అనుకోవచ్చు.
కాని నిత్య జీవ పరలోక దేవుని రాజ్యములో నివసించడం ద్వారా మనకి అస్సలు విసుగు అనే పదము ఒక్క క్షణము కూడా మనకి జ్ఞాపకమునకు రాదు.
“జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.” – కీర్తనలు 16:11
“ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతోను ఆడు పిల్లలతోను నిండియుండును.” – జెకర్యా 8:5
మనమంతా ఎంతో సంతోషముతో నిరంతర ఆనందంతో ఎడతెగని సంతోషముతో ఉత్సాహ గానాలు చేస్తూ పాటలు పాడుతూ శ్రేష్టమైన నైపుణ్యముతో వాయిద్యాలు వాయిస్తూ దేవుని పండుగ జరుపుకుంటూనే ఉంటాము.
“వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.” – యెషయా 35:10
“యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.” – యెషయా 51:11
“పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నియు నీయందే యున్నవని వారందురు.” – కీర్తనలు 87:7
“మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దలయెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగువేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.” – ప్రకటన గ్రంథము 14:2-3
నిత్య జీవము ఎలా ఉంటుంది?
“అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” – ప్రకటన గ్రంథము 21:3-4
మరణము ఇక ఉండదు. చావు అనేది వారికి ఇక ఉండదు. కాని కొంత మంది నిత్య నరకం అని చెప్పి భయపెడుతూ ఉంటారు. బైబిలు ప్రకారము మరణము అంటే నరకం కాదు. మరణము అనగా మరణ నిద్ర. అలాగ కాకుండా వారు మరణము అంటే నిత్య నరకము అని వక్రీకరించిన దాని ప్రకారమైనా కూడా నిత్య నరకము అనే మరణము కూడా ఉండదు అని బైబిలు చెప్తుంది. కాబట్టి ఇక మరణిస్తాము అనే భయము ఉండదు. ఎప్పుడు ప్రాణము పోతుందో అనే భీతితో బ్రతుకనవసరము లేదు.
ఏడ్పు ఉండదు. ఇక మనలను బాధ పెట్టేది అక్కడ ఏదీ ఉండదు. అందరు సామరస్యముగా ఎవరి స్వేచ్చకు తగినట్లు వారు దేవుడిని ఆరాధిoచుకుంటూ ఐక్యతతో కలిసి మెలిసి ఉంటారు. అక్కడ మనలను బాధపెట్టేవి కాని ఏడ్పిoచేవి కాని ఏమి ఉండవు. నిత్యానందారాధనలు మాత్రమే ఉంటాయి.
వేదన ఉండదు. వేదన అనగా నొప్పి. కాబట్టి ఇక అక్కడ మనకి ఏ దెబ్బ తగలదు. ఏ గాయము అవదు. మన శరీరములో ఏ బలహీనత ఉండదు. మన శరీరమంతా సంపూర్ణమైన బలముతో ఉంటుంది. అక్కడ తొట్రిల్లడం ఉండదు. రోగము ఉండదు. శరీర అవయవాలు అన్ని పూర్తి బలముతో పరిపూర్ణమైన ఐక్యతతో నిత్యము పని చేస్తూనే ఉంటాయి. కాబట్టే ఇక కొంచెం నొప్పి అనేది కూడా ఉండదు.
రోగము ఇక ఉండదు
“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.” – యెషయా 33:24
అనగా ఇక మన శరీరాన్ని కృశింప చేసే దద్దుర్లు, పుండ్లు, జ్వరాలు, జలుబులు, తలనొప్పులు, క్యాన్సర్లు, బిపిలు, గుండె పోటులు, అల్సర్లు లాంటివి ఏ రోగము కూడా ఆ రాజ్యములో ఉండదు.
శాపము ఇక ఉండదు మరియు ఆకలి దప్పికలు ఇక ఉండవు
“ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును.” – ప్రకటన గ్రంధము 22:3
“వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,” – ప్రకటన గ్రంథము 7:16
ఇదంతా ఒక్క సారి ఆలోచించండి. ఇటువంటి మహార్ఆరోగ్యముతో సుఖంతో జీవించడం ఎంత గొప్ప ధన్యతో కదా!
భౌతిక శరీరము మహిమా శరీరముగా మార్చబడును
“ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.” – 1 కోరింథీయులకు 15:51-54
“మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.” – ఫిలిప్పీయులు 3:20-21.
ఇలాగ మన బలహీనమైన శరీరాలు, కుళ్లిపోయే శరీరాలు సైతం దేదివ్యమానంగా ప్రకాశించే మహిమా శరీరాలుగా మార్చబడతాయి.
అలసట ఇక ఉండదు
“యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు” – యెషయా 40:31
ఒక్కసారి మన భౌతిక శరీరములను చూసినట్లయితే కొంత దూరం అనగా గట్టిగా ఒక్క మైలు వేగంగా పరుగెత్తగానే రొప్పుతూ అలసిపోతాము. కాని దేవుని రాజ్యములో మనకి ఇవ్వబడే శరీరాలకు అస్సలు అలసటే ఉండదు.
అంతే కాదు మనము పక్షి రాజు వలె పైకి ఎగురుతాము అని బైబిలు ఎంతో స్పష్టంగా చెప్తుంది. అనగా మనము పక్షుల లాగా రెక్కలు చాపి దేవ దూతలను పోలి ఎగురుతాము అని బైబిలు చెప్తుంది.
మనము దూతల వలె ఉంటాము
“పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.” – మత్తయి 22:30
అంగవైకల్యం ఇక ఉండదు
“గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును” – యెషయా 35:5-6
ఆకలి దాహములు ఇక ఉండవు
“వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,” – ప్రకటన గ్రంధము 7:16
ఇలా మనము చిరతరుణమైన మహిమా శరీరములతో ప్రకాశిస్తూ రెక్కలు చాచి ఆకాశ విశాలాలలో ఎగురుతూ భూమి మొత్తము చుడుతూ మనకు తెలియని అనేక వింతైన సంగతులను పరిశోధిస్తూ వాటిని గ్రహిస్తూ, దేవుని యొక్క గూఢమైన మర్మములను నేర్చుకుంటూ ఇక అంతములేని కాలాతీతమైన దేవుని జ్ఞానము గురించిన పరిశోధనలలో మునిగిపోతాము.
“ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు. నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభ వింతురు వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు వారు యెహోవా చేత ఆశీర్వదింపబడినవారగుదురు వారి సంతానపువారు వారియొద్దనే యుందురు.” యెషయా 65:17-19; 21-24
ఇక ఏదైనా అపాయము సంభవిస్తుందని భయపడనక్కరలేదు. రోదనావిలాపనలు ఇక ఉండవు. ఆ యెరూషలేము పట్టణములో పౌరసత్వము పొందిన వారందరు అనగా నిత్య జీవపు వారసులు అయిన వారు అందరు ఎల్ల వేళలా హర్షించెదరు.
క్రూరమృగములు సైతం సాధుజంతువులను పోలి జీవిస్తాయి
“తోడేళ్లును గొఱ్ఱపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” యెషయా 65:25
“తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” – యెషయా 11:6-9
ఏ జంతువు కూడా ఇతర జంతువులకు కాని మనుష్యులకు కాని ఏ హాని తలపెట్టవు. ఆ రాజ్యమంతా మహా ఘననీయుడైన సత్యవంతుడైన యెహోవా దేవుని స్వచ్చమైన నీతిమంతుల ఆరాధనలతో నిండి ఉంటుంది.
మాంసాహారము ఇక ఉండదు
దేవుని రాజ్యములో మరణము ఇక ఉండదు అని మనము తెలుసుకొన్నాము. మరి మరణము లేకుండా మాంసాహారము ఉండదు. కాబట్టి ఆదియందు దేవుడు మానవుడిని చేసినప్పుడు అతడికి ఏ ఆహారమైతే నియమించబడిందో ఆ మొదటి ఆహారమే దైవ రాజ్యములో మనయొక్క ఆహారము.
“దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. భూమి మీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.” ఆదికాండము 1:29-30
“నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.” – యేహెజ్కేలు 47:12
“ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.” – ప్రకటన గ్రంథము 22:2
ఇలాగ దేవుడు కేవలము శాఖాహారము మాత్రమే జంతువులతో సహా అందరికి ఆహారముగా అనుగ్రహించాడు. కాని మనుష్యులు వారి పాపాల వలన పౌష్టికమైన ఆ శాఖారమును కొలిపోయి భౌతిక శరీరమును త్వరగా బలహీన పరచి వారి పాపాలకు అడ్డు కట్ట వేసే మాంసాహారానికి అలవాటు పడ్డాడు.
అందుకే దేవుని నిత్య జీవ రాజ్యములో మాంసాహారము ఇక ఉండదు. కాబట్టే మనుష్యులకే కాని జంతువులకే కాని మరణము అనేది ఇక ఉండదు.
భవనాలు భక్తుల స్వాస్త్యము
“నా తండ్రి యింట అనేక నివాసములు(భవనాలు) కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. ” – యోహాను 14:2-3
దేవుని పరలోక నిత్య జీవ రాజ్యము మనుష్యుల ఆలోచనలకు అంతు పట్టని మహిమాలంకారాలతో నిండి ఉంటుందని పరిశుద్ధ బైబిలు చెప్తుంది. అది మనుష్యులు గ్రహింప లేరు అని వొక్కాణిoచి బైబిలు చెప్తుంది.
“ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.” – 1 కొరింథీయులకు 2:9
ఒక్కసారి క్రింది వచనాలు చదవండి. అవి కేవలం అత్యంత స్వల్ప వివరణములు మాత్రమే. కాని వాటి లోలోతుల్లో దేవుని ఆశ్చర్యాద్భుత శక్తులు మనము చూడగలము.
“ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను. దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱ పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవాది సుగంధము. దాని పండ్రెండు గు మ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము. ” – ప్రకటన గ్రంథము 21: 10-23
ఆమెన్! కాబట్టి ఇటువంటి మహోన్నతమైన మహా పరిశుద్ధ దేవుని దగ్గర ఆయన పట్టణములో నివశించే భాగ్యము కేవలం పరిశుద్ధమైన నీతిమంతులకే గాని అపవిత్రతను జరిగించే అవినీతిమంతులకు కాదు. కేవలం శాంతి సమాదానములతో నిండి ఉండడమే కాదు, మహార్తేజస్సు ప్రజ్వలిల్లే దేవుని సేవిస్తూ ఆ మహిమలో పాలిభాగస్తులు అయి ఉండేదే దేవుని నిత్య జీవ రాజ్యము.
ప్రకృతి విపత్తులు ఇక ఉండవు
బలాత్కారము అనేదే ఇక ఉండదు.
“ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.” – యెషయా 60:18
ఇప్పుడు భూమిని నాశనము చేస్తున్న భూకంపాలు, వరదలు, కరువులు, తుఫానులు, సుడిగుండాలు లాంటివి ఇక ఎప్పటికి ఉండవు.
చెట్లు వాడిపోవడం ఎండిపోవడము ఇక ఉండవు
“నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.” – యేహెజ్కేలు 47:12
“అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.”
ఇటువంటి అమోఘమైన సంగతులను అనేకములు నేర్చుకోవచ్చు.
అవును. దేవుని దేదివ్యమైన మహిమను కన్నులారా చూచునట్లు ఇక గ్రుడ్డితనము ఉండదు. ఆయన గురించిన గొప్పసంగతులను వినునట్లు ఇక చెవుడు ఉండదు. ఆయన మహోన్నతను స్తుతులతో వివరించుటకు మూగత్వము ఇక ఉండదు. అన్నింటికంటే ఎక్కువగా దేవుని యొక్క పాటలకు సంగీత వాద్యములు వాయిoచునట్లుగా మరియు రెక్కలు చాచి నాట్యమాడునట్లుగా ఇక అవుడు అస్సలే ఉండదు.
వీటన్నింటిని మించి దేవుడు మన కొరకు
“నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును(గానముతో నీయందు సంతోషించును). ”